మాస్క్ లకు కొరత
రంగారెడ్డి, మార్చి 7
గ్రేటర్ నగరంలో కరోనా కలకలంతో మాస్కుల ధరలకు మండిపోతున్నాయి. నగరంలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో, అదికారులు అప్రమత్తమై జాగ్రత్తలు పాటించాలని సూచించడంతో మాస్కులకు ఒకసారిగా డిమాండ్ పెరిగింది. వైరస్ సోకకుండా ఉండటానికి మాస్కుల ధరించాలన్న ఉద్దేశంతో చాలామంది మాస్కులు తీసుకోవడానికి మందుల దుకాణాల్లో ఎగబడుతున్నారు. ఇదే అదునుగా భావించిన మెడికల్ దుకాణాల నిర్వహకులు ధరలు మూడింతలు పెంచి దోపిడీకి తెర లేపారు. హోల్‌సెల్‌లో రూ. 1.60విలువ చేసే రెండు లేయర్ల మాస్కును రూ. 20 వరకు విక్రయిస్తుండగా, రూ.30 విలువ చేసే ఎన్95 మాస్కు రూ. 250వరకు అమ్మకాలు చేస్తున్నారు.మాస్కులకు ఎటువంటి కొరతలేదని ప్రభుత్వం ప్రకటన చేసిన వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అక్రమ సంపాదన వేటలో పడ్డారు. నగరంలోని గాంధీ,ఉస్మానియా,నిమ్స్ ఆసుపత్రుల వద్ద మెడికల్ షాపుల్లో మరింత డిమాండ్ పెరిగింది. తక్కువ ధరకు మందులు విక్రయించే జనరిక్ దుకాణాల్లో కూడా మాస్కుల ధర పెరిగాయి. ఒక్కొ మాస్కును రూ. 15వరకు అమ్ముతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ ధర రూ. 160 ఉంటే కరోనా వైరస్ లక్షణాలు బయటపడటంతో ఏకంగా రూ. 1500లకు పెంచారు. ప్రైవేటు దుకాణాల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో 50వేల మాస్కుల సరఫరా చేసి ప్రజలకు ఉచితంగా అందజేసే విధంగా చూడాలని వైద్యాధికారులకు సూచినట్లు తెలిసింది.