YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాన్సాస్ ట్రస్టు వివాదం... జగన్ సర్కార్ పై అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు

మాన్సాస్ ట్రస్టు వివాదం... జగన్ సర్కార్ పై అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు

మాన్సాస్ ట్రస్టు వివాదం... జగన్ సర్కార్ పై అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు
విజయనగరం, మార్చి 7
మాన్సాస్ ట్రస్టు వివాదంపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వ వైఖరిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా సున్నితమైన వ్యవహారం అన్నారు. ఒక మతానికి చెందిన వారిని తీసుకొచ్చి ... మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తే... సమస్యలు ఉంటాయన్నారు. వేరే మతాల వారిని దేవస్థానం బోర్డు ఛైర్మన్లగా నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో సమతుల్యతతో వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోను బయటపెట్టలేదన్నారు. ఇది ఎవరి నిర్ణయమో అర్థంకాని పరిస్థితి అన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరి వింతగా ఉందన్నారు అశోక్ గజపతిరాజు. సింహాచలంతో పాటు మనకు వందకు పైగా ఆలయాలు ఉన్నాయి... వాటికి ఎంతో విలువైన భూములున్నాయన్నారు. ఆ భూములు దేవుడికే చెందాలన్నారు. దాతల భూములు ఆలయాలకే చెందుతాయన్నారు.రాజకుటుంబానికి కొన్ని ఆచారాలు ఉంటాయన్నారు అశోక్ గజపతి రాజు. జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తామన్నారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం జీవోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. జీవో ఎందుకు రహస్యంగా ఉంచారన్నారు. ప్రభుత్వం జీవో బయట పెట్టకుంటే... కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రాజధాని తరలింపు వ్యవహారంతో తాము కూడా బాధితులుగా మారామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు. ఒకవేళ మాన్సాస్ ఛైర్మన్‌గా తాను తప్పు చేసి ఉంటే తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కదా అన్నారు. దొడ్డి దారిలో ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. 1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ప్ అండ్ సైన్సెస్ (మాన్సాస్)ను నెలకొల్పారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు మాన్సాస్ విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతిరాజుకు మాన్సస్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది.

Related Posts