మనిషికి ఉండవలసిన సహజమైన తత్త్వం మానవత్వం. అది కోల్పోయిన మనిషి జాతికి ద్రోహం చేసినవాడవుతాడు. భూమికే భారమైపోతాడు.
స్వార్థరాహిత్యంవల్ల, పారమార్థిక చింతన వల్ల మానవత్వం వికసిస్తుంది. లోకకల్యాణమై గుబాళిస్తుంది. ‘బతుకు- బతకనివ్వు’ అన్నది ఆర్యోక్తి. ‘నిన్ను నువ్వు ఉద్ధరించుకో, పరులను ఉద్ధరించు’ అని భగవద్గీత చెబుతోంది.
పారమార్థిక చింతన చేసినవారు సుకృతులు, పుణ్యాత్ములు, అమరలోకచిరవాసులు అని వర్ణించింది మహాభారతం.
కాశీఖండంలో అగస్త్య మహర్షి లోపాముద్రకు చెప్పిన హితవు అంతా ఆదర్శవంతమైన పరమార్థమే.
మన పురాణేతిహాసాలన్నీ ఆదర్శవంతమైన పాత్రలతో, కథలతో, సందేశాలతో భాసిల్లాయి. మంచినే కంటూ, మంచినే మననం చేసుకుంటూ, మంచినే ఆచరించడం మీద ధ్యాస ఉంచితే, అదే శాంతికి దోహదపడుతుంది’ అని యోగ వాసిష్టం తెలుపుతోంది.
ఆశ్రితులకు అవసరమైనది ఇచ్చి, తాను మితంగా స్వీకరిస్తూ, ఎక్కువ శ్రమించి తక్కువగా విశ్రమించేవాడు, శరణన్న శత్రువును చిరునవ్వుతో క్షమించేవాడు, శాంతస్వభావుడు- ఆత్మజ్ఞాన సంపన్నుడని విదురుడు ధృతరాష్ట్రుడికి పదేపదే హితవు చెప్పాడు.
పరులకు ఉపకారం చేయడం పుణ్యం అని, పరులను పీడించడం పాపమంటూ కోటి గ్రంథాల సారాంశాన్ని ఓ చిన్న శ్లోకంలో అందించాడు కవికుల గురువు కాళిదాసు.
ఆదిశంకరులు, రామానుజులు, భర్తృహరి స్వసుఖాలకంటే సామూహిక శ్రేయస్సుకే పాటుపడటం సత్పరుషుల సహజాభరణమని నిరూపించారు.
శిబి, దదీచి, కర్ణుడు, బలి వంటి మహాదాతల్లో స్వార్థమనే దుర్లక్షణం ఇసుమంతైనా కనిపించదు. దీన జనసేవ జరిగిన చోటే దైవం ఉంటాడన్న సత్యం బాపూజీకి అపరిమితమైన స్ఫూర్తినిచ్చింది.
ప్రకృతి విశ్వరూపం ముందు మనిషి తాను అల్పుడిని అన్న వాస్తవాన్ని గ్రహిస్తే, పంచభూతాలను ఇంతగా స్వార్థానికి బలిచేయడు. దుఃఖం ఎలా సహజంగా కలుగుతుందో, దాన్ని నివారించే మార్గమూ అలాగే ఉంటుందన్న గౌతమ బుద్ధుడి బోధా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి.
దుఃఖానికి మూలం స్వార్థమే. విపరీతమైన కోరికలు, ఆశలు మహావికారాలు మనిషిని స్వార్థం అనే అగ్నిలో దగ్ధం చేస్తున్నాయి. ప్రేమ, ఔదార్యం, క్షమ, సహనం నిస్వార్థాన్ని వృద్ధిచేస్తాయి. ఇంద్రియ సంయమనం పరమార్థచింతనకు పాదు చేస్తుంది. సత్సాంగత్యం ఆత్మజ్ఞాన ప్రాప్తికి దోహదపడుతుంది.
సత్కర్మలతో శరీరాన్ని, హృదయాన్ని పునీతం చేసుకోవాలి. ప్రత్యణువులో దైవదర్శనం చేసుకోగల జ్ఞానాన్ని ఆర్జించాలి. ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చెట్టు, చెరువు, గోవు మొదలైనవి పరుల కోసమే జీవిస్తున్నాయి. వాటిలో ఏ కోశానైనా స్వార్థం కనిపిస్తుందా ???
మనకు? మెదడు, మనసు మనకు వరాలుగా దొరికినప్పుడు మనమెంత నిస్వార్థంగా ఉండాలి?
ఉడత, జటాయువు వంటి ప్రాణులు సైతం రాముడికి మహోపకారం చేస్తే- ప్రతిగా రాముడు చేసిన ధర్మవర్తనం మనకు తెలియనిదా? ఈ నిస్వార్థగుణం పశుపక్ష్యాదుల నుంచి నేర్చుకోవలసిన దౌర్భాగ్య స్థితి మనిషికి దాపురించిందంటే- మానవజాతి భవిత రేపెలా ఉంటుందో ఊహించగలమా?
అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, అవయవ దానం, రక్తదానం వంటి దానధర్మగుణాలు అలవరచుకుంటే స్వార్థమనే మిన్నాగు కక్కే గరళం కూడా మననేం చేయలేదు. ‘సొంత లాభం కొంతమానుకు పొరుగువారికి తోడు పడవోయ్’ అన్న గురజాడ సందేశం మనకు వెలుగులమేడ అని గ్రహించగలిగితే అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని మనసు నుంచి తరిమికొట్టగలం!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో