YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నాదెండ్ల కాన్ఫిడెన్స్ లెక్కేంటీ

 నాదెండ్ల కాన్ఫిడెన్స్ లెక్కేంటీ

 నాదెండ్ల కాన్ఫిడెన్స్ లెక్కేంటీ
విశాఖపట్టణం, మార్చి 9
ఏదైనా రాజ‌కీయాల్లో కొంత ఖుషీ ఉండాలి గురూ. ఎప్పుడూ ఉన్నచోటే ఉంటే.. ఎప్పుడు అన్నమాటే అంటే.. అందులో మ‌జా ఏ ముంటుంది? బ‌హుశ ఈ విష‌యం రాష్ట్రంలోని జ‌న‌సేన చాలా లేటుగా గుర్తించిన‌ట్టుగా ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం ఇప్పుడు ఆ పార్టీ నిరాశా నిస్పృహ‌ల నుంచి ఓ స‌మూల మార్పు దిశ‌గా అడుగులు వేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటి ? అస‌లు మార్పు కోస‌మే క‌దా ? ప‌్రశ్నించ‌డం కోస‌మే క‌దా జ‌న‌సేన పుట్టింది. అలాంటి పార్టీలో ఇప్పుడు మార్పు.. ఏమిటి ? అంటున్నారు. అక్కడే ఉంది అస‌లు త‌మాషా. పార్టీ అధినేత ప‌వ‌న్‌ 2014కు ముందు పార్టీ ప్రారంభించారు. అయితే, ఆయ‌న గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే పోటీకి దిగారు.ఇంత వ‌ర‌కు స‌హ‌జంగా ఎవ‌రైనా చేసేదే. అయితే, ఆయ‌న అత్యంత నిరాశావాదంతోనే కాలం గ‌డిపార‌ని చెప్పాలి. దీనికి ప్రధాన కార‌ణం. కొన్నిరోజులు అధికారం త‌మ‌దేన‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల‌కు ముందు కొన్ని స‌భ‌ల్లో కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా ? అని ప్ర‌శ్నించారు. ఇంకొన్ని స‌భ‌ల్లో మాత్రం మాకు అధికారం పై వ్యామోహం లేదు. క‌నీసం 25 ఏళ్ల టైం పెట్టుకుని మేం రాజ‌కీయాల్లో వ‌చ్చాం అన్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము ప్రజ‌ల నాడిని ప‌ట్టుకునేందుకు, వారి స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని, అధికారం కోసం కాద‌ని చెప్పారు. అస‌లు ప‌వ‌న్‌లో క్లారిటీ మిస్సయింద‌నే భావ‌న ఏర్పడి ఓటు వేయాల‌నుకున్న వారు వెన‌క్కి జంకార‌ని గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. జ‌న‌సేన అభిమానుల్లోనే చాలా మంది ప‌వ‌న్ కల్యాణ్ పార్టీకి ఓట్లు వేయ‌లేదు. చివ‌ర‌కు ప‌వ‌న్ సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఆ పార్టీలో పెను మార్పు చోటు చేసుకుంది. గ‌తంలో లేని వ్యాఖ్యలు, దూర ఆలోచ‌న‌లు కూడా క‌నిపించాయి. వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ‌లో ఆ పార్టీ పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఒక‌వైపు జ‌గ‌న్‌ను తిడుతూనే మ‌రోవైపు జ‌న‌సేన నేత‌లు, కార్యకర్తలు ఇప్పటి వ‌ర‌కు ఊహించ‌ని విధంగా ఆయ‌న వ్యాఖ్యలు సంధించారు.అవే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో తాము బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. ఖ‌చ్చితంగా తాము గెలిచి జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తుంద‌ని, ప‌వ‌న్ సీఎం అయిపోతార‌ని చెప్పారు. ఇంత కాన్ఫిడెన్స్‌గా జ‌న‌సేన నాయ‌కులు ప్రజ‌ల‌కు ఇన్ని విష‌యాలు చెప్పడం ఇదే తొలిసారి కావ‌డంతో ఒక్కసారిగా కార్యక‌ర్తలు ఆశ్చర్యానికి గుర‌య్యారు. అయితే ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా వ‌చ్చాయి. అవేంటంటే.. ప‌వ‌న్ సీఎం.. నాదెండ్ల, క‌న్నాలు డిప్యూటీ సీఎంలు అంటూ చ‌లోక్తులు పేలాయి. ఇదీ సంగ‌తి.

Related Posts