తవ్వే కొద్ది బయిటకు వస్తున్న బీఆర్ ఎస్ అక్రమాలు
హైద్రాబాద్, మార్చి 9
మహానగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం అమలు చేసిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దరఖాస్తుల పరిశీలనలో కింది స్థాయి సిబ్బంది అవినీతి, అవకతవకలకు పాల్పడకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ స్కీం నిబంధనల మేరకు అక్రమంగా నిర్మించిన భవనాలను, ఉన్న అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలు మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవల్సి ఉండగా, భవనం నిర్మించకుండానే ఓపెన్ ప్లాట్లలో భవనాలున్నట్లు నకిలీ ఫొటోలు సృష్టించి దరఖాస్తులు వచ్చినందున, ఇలాంటి పరిణామాలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు అధికారులు కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం 150 చదరపు మీటర్ల స్థలంలో అనుమతి తీసుకుని గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకునే వారికి నిబంధనల ప్రకారం 150 మీటర్ల స్థలానికి అనుమతి ఇవ్వటం కుదరదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 150 మీటర్ల స్థలంలో రెండు అంతస్తులు నిర్మించినట్లు ఫొటోలు చూపి, దరఖాస్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులు కళ్లుగప్పి బీఆర్‌ఎస్ స్కీం కింద క్లియరెన్స్ పొందిన తర్వాత, టౌన్‌ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసుకుని రెండు అంతస్తులు, అవసరమైతే పైన మరో అంతస్తు కూడా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. 2015లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమివ్వటంతో ఏకంగా సుమారు లక్షా 36వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నందున ఫైనల్ ప్రొసీడింగ్‌లు మాత్రం జారీ చేయటం లేదు.న్యాయస్థానం ఆదేశాల మేరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టిన జీహెచ్‌ఎంసి అధికారుల తనిఖీలో వారే నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. వేలాది దరఖాస్తులకు సంబంధించి భవనాల ఫొటోలు లేనట్టు గుర్తించారు. రెండువేల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద వచ్చిన దరఖాస్తులను టౌన్‌ప్లానింగ్ అధికారులు ఐదు ప్రధాన కారణాలతో తిరస్కరిస్తున్నారు. ఇందులో దరఖాస్తు సమర్పించిన సమయంలోనే ఫొటో అప్‌లోడ్ చేయని వాటిని, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణం ఉంటే, యాజమాన్యపు హక్కుకు సంబంధించి వివాదాలున్నా, కోర్టులో కేసులు విచారణ స్థాయిలో ఉంటే, వక్ఫ్, ప్రభుత్వ, యూఎల్‌సీ భూముల్లో ఉన్న భవనాల తాలుకూ వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు.ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు, లేఔట్లలోని ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ దరఖాస్తు సమర్పణ మొదలుకుని మిగిలిన ప్రక్రియలన్నీ కూడా ఆన్‌లైన్ విధానం చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ స్కీం కింద వచ్చిన లక్షా 36వేల దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు డాక్యుమెంట్లకు సంబంధించి లోపాలున్నా, ఇంకా ఇతర డాక్యుమెంట్లు ఏమైనా అవసరమైనా దరఖాస్తుదారుడికి సమాచారమిస్తున్నారే తప్పా, ఫొటోలు లేని దరఖాస్తులకు మరో ప్రస్తావన లేకుండా తిరస్కరిస్తున్నారు. క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లినపుడు భవనం ఎపుడు నిర్మించారనే విషయాన్ని గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఎజెన్సీ నుంచి అధికరాలు వివరాలను తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ స్కీంను ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 30, 2015 కటాఫ్ తేదీకి ముందు ఎక్కడ, ఏ భవనం ఎన్ని అంతస్తులు ఉందనే విషయం సులువుగా గుర్తిస్తున్నారు. అసులు నిర్మాణం ఉందా? అనే విషయం కూడా స్పష్టంగా నిర్దారించేందుకు బీఆర్‌ఎస్ మొబైల్ యాప్‌కు ఎన్‌ఆర్‌ఏఎస్‌ను అనుసంధానం చేస్తున్నారు.