Highlights
- పార్లమెంటు సమావేశాల చివరి రోజున తమ ఎంపీలు రాజీనామా
- ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్షలు
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాను సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరు పక్షాల అధినేతలు పోటాపోటీగా అస్త్రాలు సంధిస్తున్నారు. ఒకరు రాజీనామాల అస్త్రాన్ని సంధిస్తే, మరొకరు అవిశ్వాసం అనే ఆయుధాన్ని ప్రయోగించారు. తాజాగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అస్త్రాన్ని బయటకు తీశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పేరేచెర్లలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేపట్టిన ర్యాలీలో జగన్ మాట్లాడారు.ఆస్కార్ అవార్డులు ఇచ్చే వారు ఏపీకి వచ్చి.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కనబరుస్తున్న తీరుని చూస్తే ఉత్తమ విలన్ అవార్డును కచ్చితంగా ఆయనకు ఇచ్చేస్తారని జగన్ సెటైర్ వేశారు.రాజధాని నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చూపిస్తున్నారని జగన్ ఘాటుగా విమర్శించారు. తమ ఎంపీలతో రాజీనామా చేయించడం లేదని, ఆయనపై ఉన్న కేసుల భయంతోనే ఇలా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసినా చేయకపోయినా పార్లమెంటు సమావేశాల చివరి రోజున తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించిన జగన్.. అనంతరం వారు నేరుగా ఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లి అక్కడే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని చెప్పారు.తమ ఎంపీలకు బాసటగా ఏపీలో ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలపాలని, విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలిరావాలని, యువతరం తమ దీక్షకు సంఘీభావం తెలపాలని జగన్ పిలుపునిచ్చారు.