పరీక్షల ఒత్తిడిని..
పిల్లల్లో కలిగే పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. ఒత్తిడి తగ్గాలంటే..
(ప్లానింగ్): పిల్లలతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. పరీక్షల సమయానికంటే ముందుగానే ఏ విధంగా పరీక్షలను ఎదుర్కోవాలో
పిల్లలతో చర్చిస్తూ సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రణాళికను రూపొందించేటపుడు చదివే సమయంలో విరామ సమయం తప్పకుండా కేటాయించుకోవాలి. కష్టమైన సబ్జెక్టులను గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించేలా, వాటిపై పిల్లలు మరింత దృష్టిని కేంద్రీకరించే విధంగా ప్రణాళిక ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
సౌకర్యవంతమైన వాతావరణం
టీవీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ మొదలైన అంతరాయాలకు దూరంగా ఉండేవిధంగా చూసుకోవాలి. పిల్లలు సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు సరిగా లేకపోతే, పిల్లలకు మెడనొప్పి, తలనొప్పి లేదా వెనె్నముకనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సోఫా లేదా మంచాలపై చదవడానికి ప్రోత్సహించవద్దు. ఇలా చేస్తే కండరాలపై ఒత్తిడి కలిగి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది.
పోషకాహారం
పరీక్షల సమయంలో పిల్లలు తిండి తినడంలో సరైన ఆసక్తి చూపించకపోవచ్చు. పిల్లలు నిర్ణీత సమయంలో ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులు సరైన బాధ్యతను పోషించాలి. ఆకలిగా వున్నప్పుడు చదువుపై ఏకాగ్రత కుదరడం చాలా కష్టం.
మంచి నిద్ర
పిల్లలు నిర్దేశించుకున్న లక్ష్యం పూర్తిచేయడానికి నిద్రను దరిచేరకుండా చేస్తూ తీవ్రంగా కష్టపడుతూ చదువుతూ ఉంటారు. మంచి నిద్ర వలన జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి. పరీక్షకు ముందురోజు అర్థరాత్రి వరకు కష్టపడుతూ చదవడం మంచిది కాదు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 6 నుండి 7 గంటలపాటు నిద్రపోయే విధంగా తగు సూచనలు ఇస్తూ గమనిస్తూ ఉండాలి.
సహాయకారిగా..
పిల్లలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలి. పిల్లలు ఎక్కువ సమయం చదవడానికి కేటాయిస్తున్నప్పుడు, ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదువుకునే గదిని శుభ్రంగా ఉంచడం చేయాలి.
పిల్లలతో మాట్లాడండి
పరీక్షల సమయంలో పిల్లలతో గడపడానికి, వారితో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పిల్లల మానసిక స్థితి, ఆందోళనలను, భయాన్ని గమనిస్తూ తగిన విధంగా గైడ్ చేస్తూ ఉండాలి. పరీక్షల సమయంలో భయం కలగడం సర్వసాధారణం అని వివరిస్తూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇస్తూ ఉండాలి.
శారీరక ఆటలను ప్రోత్సహించాలి
పరీక్షల సమయంలో శారీరక ఆటలు ఆడడంవలన మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది మరియు శక్తి సామర్థ్యాల స్థాయిలు పెరుగుతాయి.
ఒత్తిడిని పెంచవద్దు
గతంలో పిల్లల ఫెయిల్యూర్స్‌ను పదే పదే గుర్తుచేస్తూ పిల్లలలో ఒత్తిడి పెంచకూడదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడదు. పిల్లలు పరీక్షలకు హాజరుకావటానికిముందు వారికి సానుకూల ఆలోచనలను (పాజిటివ్ థింకింగ్స్) కల్పించాలి.
పిల్లలకు శిక్షణ
పిల్లలో వైఫల్యాలను ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్పిస్తూ ఉండాలి. ఓటమి అనేది విజయానికి ఒక మెట్టులాగా, విజయాన్ని సాధించడానికి కావాల్సిన సంకల్పబలం అందిస్తూ ప్రోత్సహించాలి.
ప్రోత్సహం
పరీక్షలు ముగిసిన వెంటనే విహారయాత్రకుగాని, లేదా పిల్లల కృషికి అభినందనీయంగా బహుమతులు అందించాలి. పరీక్షలలో పొందే మార్కులతో కాకుండా పిల్లలను పిల్లలుగానే గుర్తించాలి. పిల్లలపట్ల స్నేహపూర్వకంగా మెదులుతూ ఉండాలి.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో