నిత్యం నరకం (నల్గొండ)
నల్గొండ, మార్చి 10 ఉమ్మడి జిల్లాలో వివిధ రకాల మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు 2.55 లక్షల మంది ఉన్నారు. వారిలో పదివేల మందికి పైగా డయాలసిస్ (రక్తశుద్ధి.) చేయించుకుంటున్నట్లు ఆరోగ్యశ్రీ లెక్కలు చెపుతున్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండేళ్ల క్రితం నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేద, మధ్యతరగతి వారితో పాటు ఉద్యోగులు సైతం ఇక్కడ డయాలసిస్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మూత్రపిండాల వైద్య నిపుణుడు లేకపోవడంతో బాధితులు హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పాటు వేసవి ప్రారంభం కాకముందే ఆయా కేంద్రాల్లో కరెంటు కోత, డీజిల్ కొరత కారణంగా గంటల తరబడి బాధితులు నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాలతో పాటు రెండింతల యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినా కొరత తీరని పరిస్థితి ఉన్న సమయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మూలంగా సమస్యలు తలెత్తుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న డయాలసిస్ వార్డులో నిత్యం 40 నుంచి 45 మంది రక్తశుద్ధి చేయించుకుంటున్నారు. ఒక వ్యక్తికి ఒక్కసారి రక్తశుద్ధి. జరిగితే ప్రభుత్వాసుపత్రికి ఆరోగ్యశ్రీ నుంచి రూ.175 వస్తాయి. ప్రతి నెలా ఈ ఒక్క కేంద్రంలోనే 1200 మందికిపైగా సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక మంది రక్తశుద్ధి చేయించుకుంటున్న కేంద్రంగా నల్గొండకు పేరున్నా రెండు నెలలుగా ఇక్కడ ఉన్నతాధికారి కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో విద్యుత్ లోవోల్టేజీ కారణం చూపుతూ కేంద్రానికి రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ సమయంలో కనీసం జనరేటర్ కూడా వాడకూడదని ఆసుపత్రి అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు వార్డు సిబ్బంది వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితులకు నిధుల కొరత ఉందని చెప్పడంతో పాటు దురుసుగా మాట్లాడడం పరిపాటిగా మారింది. ఈ సమస్యలపై నల్గొండ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నర్సింహ వివరణ కోరడానికి పలుమార్లు సంప్రదించగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ వార్డులో నిత్యం 17 నుంచి 25 మందికి రక్తశుద్ధి. నిర్వహిస్తున్నారు. సరిపడా మిషన్లు లేక మరో 20 మంది బాధితులు రక్తశుద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో రోజు 18 నుంచి 21 మందికి రక్తశుద్ధి నిర్వహిస్తున్నారు. ఇక్కడ డీజిల్ కొరత కారణంగా జనరేటర్ వాడడం లేదు. దీంతో పాటు గత మూడు నెలలుగా బాధితులకు రక్తాన్ని పెంచే ఎల్‌త్రో ఇంజక్షన్ల సరఫరా నిలిపివేశారు. 30 మంది వరకు బాధితులు రక్తశుద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. హుజూర్‌నగర్‌లో నిత్యం 15 నుంచి 21 మందికి రక్తశుద్ధి. నిర్వహిస్తున్నారు. మరో 16 మంది వెయిటింగ్ లిస్టులో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడ జనరేటర్ పాతది కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న నీటికొరత రానున్న వేసవిలో మరింత పెరగనుందని బాధితులు వాపోతున్నారు