YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ

త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ

త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ
విజయవాడ, మార్చి 10
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరో తేలిపోయింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు బెర్తులు ఖాయం చేశారు. వీరిలో మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. శాసనమండలి రద్దు చేయడంతో.. ఎమ్మెల్సీ పదవులు పోతాయి కాబట్టి.. వారికి రాజ్యసభ ద్వారా న్యాయం చేశారు. వీరిద్దరూ రాజ్యసభకు వెళ్లిపోతే రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ అదే జరిగితే ఈ ఇద్దరి స్థానంలో ఎవరెవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని అందరూ పట్టుదలతో ఉన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ మంత్రి పదవి రేసులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఎమ్మెల్యే రోజా. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ తీరా జగన్ మాత్రం సామాజిక సమీకరణాలతో ఆమెకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు.. వెంటనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు సర్థిచెప్పడంతో.. తర్వాత ఆమె ముఖ్యమంత్రి జగన్‌ను కలిశాక కాస్త మెత్తబడ్డారు. కొద్ది రోజులకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని అప్పగించారు. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు.. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాన్ని బాగా కార్నర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులే కొట్టేశారు.. అంతేకాదు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో తనకు మంత్రి పదవిపై ఆశలు ఉన్నాయని పరోక్షంగా చెప్పారు. ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో ఆమె మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా జగన్ రోజాను కరుణిస్తారా లేదా అన్నది చూడాలి.కేబినెట్ బెర్త్‌పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో స్వయంగా వైఎస్ జగన్ ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. కానీ ఆయనకు సామాజిక సమీకరణాలతో పదవి దక్కలేదు.. తర్వాత నామినేటెడ్ పదవి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరిగింది. అయినా ఆర్కే మాత్రం నిరాశ చెందలేదు. అసెంబ్లీలోనూ యాక్టివ్‌గా ఉన్నారు.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో.. మళ్లీ ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా జగన్‌ తనకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. అంతేకాదు మంత్రి మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా కావడంతో.. ఆయన కేబినెట్ నుంచి బయటకు వస్తే.. మళ్లీ అదే జిల్లా నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తే.. తనకే పదవి దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశలు పెట్టుకున్నారు.మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మరొకరు.. కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి. వాస్తవానికి పార్ధసారథి తనకు తొలిసారే కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. కానీ జగన్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. విస్తరణలో తనకు అవకాశం వస్తుందని సారథి భావిస్తున్నారు.. బీసీ నేత కావడంతో.. మోపిదేవి, పిల్ల సుభాష్ కూడా అదే సామాజికవర్గం కావడంతో తనకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, సీనియార్టీ కలిసొచ్చే అంశం. కానీ కృష్ణాజిల్లాలో లెక్కలు మాత్రం ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఎందుకంటే జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు (పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌) ఉన్నారు. మరి నాలుగో బెర్త్ ఇస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కానీ బీసీ కోటాలో పార్ధసారథికి కేబినెట్ పదవి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది చూడాలి.ఇక మిగిలిన ఆశావహుల విషయానికి వస్తే.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అంబటి రాంబాబుతో పాటూ మరికొందరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు స్పీకర్ తమ్మినేని సీతారాంను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణకు ఎలాంటి స్ట్రాటజీతో వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలతో పాటూ జిల్లాలవారీగా లెక్కలు బేరీజు వేసుకుంటారా.. గతంలో పదవి ఆశించినవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి. అంతేకాదు రెండున్నరేళ్ల కొందరికి.. మరో రెండున్నరేళ్లు మరికొందరికి అవకాశం కల్పిస్తామని జగన్ సంకేతాలు ఇచ్చారు. అదే పద్దతిని అనుసరిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింంది. మొత్తానికి శాసనమండలి రద్దు, రాజ్యసభ ఎన్నికలతో ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కింది

Related Posts