మరో మూడ్రోజులు పట్టే అవకాశం
ఆయా శాఖలతో విడివిడిగా భేటీ కానున్న ఆర్థికశాఖ
వచ్చేనెల 9న దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ కార్యదర్శుల భేటి
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. అందుకనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. ఇందుకనుగుణంగా వివిధ పథకాలు, కార్యక్ర మాలకు అవసరమైన కేటాయింపులపై ఆ శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మరో నాలుగైదు శాఖలు ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల తర్వాత సదరు డిపార్టుమెంట్లు తమ లెక్కలను సమర్పించనున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత కసరత్తు మరింత వేగం పుంజుకోనున్నది. వాస్తవానికి రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించిన బడ్జెట్‌ను రూపొందించేందుకు సిద్ధం కావాలంటూ డిసెంబరు 27నే ఆర్థికశాఖ ఇతర అన్ని శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. తమతమ శాఖలు, విభాగాలకు ఎన్ని నిధులు కావాలో పేర్కొంటూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలంటూ అప్పుడే సూచించింది. ఇందుకోసం జనవరి 8 వరకు గడువునిచ్చింది. ఆ తర్వాత గడువును పెంచాలంటూ వివిధ శాఖల కార్యదర్శులు కోరటంతో దాన్ని ఈనెల 15 వరకు పొడిగించారు. ఆ తర్వాత 18 వరకు వెసులుబాటునిచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అందిన ప్రతిపాదనల ఆధారంగా శుక్రవారం నుంచి కసరత్తులు మొదలుపెట్టామని అధికార వర్గాలు తెలిపాయి.మరోవైపు ప్రతిపాదనలన్నీ అందిన తర్వాత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు.. మిగతా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతా ధికారులతో విడివిడిగా భేటీ కానున్నారు. తద్వారా ఆయా శాఖలు అడిగిన కేటాయింపులపై ఆయన మరింత సమగ్రంగా చర్చిస్తారు. ఈ క్రమంలో ఆయా కేటాయింపుల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకునే అవకాశముందని సమాచారం.
వచ్చేనెల 9న దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ కార్యదర్శుల భేటి
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జరగనుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సీఆర్ హెచ్‌ఆర్‌డీ)లోగాని, మరేదైనా పెద్ద హోటల్‌లోగానీ ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం చైర్మెన్ ఎమ్‌కే సింగ్ ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.