బెజవాడ వెహికల్ డిపోలో ఇంటి దొంగలు
విజయవాడ,మార్చి 11
ఇదేంటి ...అనుకుంటున్నారా... మీరు విన్నది నిజమే... బెజవాడ వెహికిల్ డిపో ఇంటి దొంగలతో కార్పొరేషన్ కు భారీగా నష్టం వాటిల్లుతోంది. విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన వెహికల్ డిపోను పరిరక్షించాల్సిన అధికార, సిబ్బందే డిపోను మింగేస్తున్నారు. చిన్న చిన్న మరమ్మతులను సైతం సక్రమంగా నిర్వహించక మూలనపడేస్తున్న వాహనాల గోడు అంతా ఇంతా కాదు. వాహనాల నిర్వహణ, మరమ్మతులు, డీజిల్ పంపిణీ, తదితర అంశాల్లో అధికార సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శానిటేషన్ పనుల కోసం ఉదయం 6 గంటలకే నగర వీధుల్లో కనిపించాల్సిన వాహనాలు డిపోలోనే ఉన్నాయి.నిర్ణీత వేళల్లో విధులకు హాజరుకావాల్సిన సిబ్బంది, ఆయిల్ సూపర్‌వైజర్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు సకాలంలో హాజరుకాకపోవడం ఒక విషయమైతే వీరిని సమన్వయపర్చి, వారితో సక్రమంగా విధులను నిర్వర్తింపచేయాల్సిన అధికార యం త్రాంగం కూడా అదే బాటలో నడుస్తున్నారు. నగర పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, చెత్త తరలించే డంపర్ ప్లేసర్లకు జిపిఎస్ సిస్టమ్‌ను అమలుచేయడం తోపాటు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేస్తున్నామని కమిషనర్ వీరపాండియన్ ప్రకటించడమే కాకుండా ఆయా అంశాలపై జాతీయ స్థాయి అవార్డులను సైతం సాధించుకోవడం జరిగింది. చెత్త వాహనాలకు ఏర్పాటుచేసిన జిపిఎస్ ద్వారా వాహనం ఏ సమయానికి ఎక్కడ డంపర్ బిన్‌ను తరలిస్తుందో ఇట్టే గుర్తించి నగరంలోని అన్ని డంపర్ బిన్లను సకాలంలో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని గొప్పలు చెబుతున్న కమిషనర్ సిబ్బంది గంటల కొద్దీ ఆలస్యంగా విధులకు హాజరుకాకపోతున్నా బయోమెట్రిక్ విధానం గుర్తించకపోవడం గమనార్హం. విఎంసి వెహికల్ డిపోకు వెహికల్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసే ఉద్యోగి తన విధులను పక్కన పెట్టి ప్రైవేటుగా ఎలక్ట్రీషియన్ షాపు నిర్వహిస్తున్నాడని, ఒకవేళ విధులకు వచ్చినా కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోవడమే కానీ, వాహన ఎలక్ట్రీషియన్ పనులు సక్రమంగా చేయడన్నారు. మరమ్మతులకు నోచుకోని 10 టైర్ల వాహనాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ తక్షణమే తగు రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.