ప్రాణాలు తీసేస్తున్న ఇసుకబట్టీలు
శ్రీకాకుళం,మార్చి 11
ఇటుకబట్టీ వ్యాపారం ఆంధ్రాను కాలుష్యం రూపంలో కాటేస్తోంది. ఇప్పటికే మూలాలు దొరకని కిడ్నీ రోగాలు ఉద్దానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, గత కొద్ది నెలలుగా ఇటుక బట్టీల కాలుష్యం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామీణ ప్రజల ఊపిరితిత్తులను హరించేస్తోంది. ఇచ్చాపురం పరిసరాల్లోని అరకభద్ర, టి.బరంపురం, బిర్లంగి, మసాకపురం, తేలికుంచి, లొద్దపుట్టి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఒడిశా ముఠాలు ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తుండగా, రౌండ్ ది క్లాక్‌లో పనిచేయించేందుకు ఉభయగోదావరి జిల్లాల యాజమాన్యాలు బరి తెగిస్తు న్నాయ. ఒడిశాకు చెందిన వందలాది కుటుంబాలు ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు నెలలకొద్ది రోజులుగా మకాం వేస్తున్నాయ. వీరిలో బాల కార్మీకులు కూడా ఉండగా, వీరిపై చైల్డ్‌లైన్ సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోతున్నారు. ఒడిశా ముఠా వ్యాపారుల బెదిరింపులు, ఆంధ్రాలో ఒడిశా బాల కార్మికులపై కేసులు పెట్టేందుకు సాంకేతికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయంటూ చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేతులెత్తేయడంతో ఒడిశాలో భవనాల నిర్మాణానికి కావల్సిన మట్టి ఇటుక తయారీ బట్టీలన్నీ ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఈ ఇటుక పూర్తిగా బొగ్గుతో కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి వేలాది మంది ఒడిశా ప్రజలు అనారోగ్యానికి గురైనట్టు అక్కడి ప్రభుత్వం తాజా సర్వేల ద్వారా పసిగట్టడంతో ఆరు మాసాల క్రితం ఒడిశాలో ఇటుకబట్టీలను నిషేధించింది. దీంతో ఆ వ్యాపారం అంతా ఆంధ్రాకు తరలించడంలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది వ్యక్తులతో ఒడిశా ముఠాలు చేతులు కలిపాయ. నిజానికి స్థానికంగా పంచాయతీ, రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే సాగిస్తున్నారు. బట్టీల దగ్గర ఇటుకల తయారీకి బోర్లు తవ్వించడంతో ఆ చుట్టుపక్కల సుమారు 60 గ్రామాలకు సాగు, తాగునీరు సమస్యలు తలెత్తుతున్నాయ. దీంతో అధికారులు ఇకనైనా చర్యలు చేపట్టాలని అందరూ కోరుతున్నారు.