డయాలిసిన్ సెంటర్లను పెంచుతాం
మండలిలో మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ మార్చి 11
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తున్నమని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బిపి, షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది . వ్యాధి ముదిరిన దశలో డయాలసిస్ చేసుకోవడం లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం మాత్రమే మార్గాలున్నాయి. ప్రస్తుతానికి జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 9 టీచింగ్ హాస్పిటల్స్ లో 45 డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నాం.ఒక్కో సెంటర్లో 5 నుంచి 10 వరకు బెడ్స్ ఉన్నాయని మంత్రి అన్నారు. బుధవారం నాడు శాసనమండలిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు నిర్వహణపై శేరి సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. అంతకుముందు సభ్యుడు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ డయాలసిస్ క్యాన్సర్ కంటే ఘోరమైనది. వారంలో మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. వీరిని పట్టించుకుంటున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక అభినందనలు. రిజిస్ట్రేషన్ సమయంలో థంబ్ ఇంప్రెషన్ పడక రోగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రెటీనా లేదా ఫేస్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలి. మెదక్ లో ఐదు బెడ్స్ ఉన్నాయి వీటి సంఖ్యను పెంచండి, సిబ్బందిని పెంచండి. నెఫ్రాలజిస్ట్ టి ఏ ,డి ఏ ఇవ్వడం లేదని హాస్పిటల్ కి రావట్లేదు అని తెలిసింది త్వరగా సమస్యను పరిష్కరించండని కోరారు. మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రికి డయాలసిస్ చేసుకోవడానికి వస్తున్నవారి సంఖ్య ఆధారంగా 24 గంటలు పనిచేస్తున్న సెంటర్లు కూడా ఉన్నాయి. అయినా ఇంకా డిమాండ్ ఉంది అందుకు అనుగుణంగా స్టడీ చేసి సెంటర్లను మరియు సిబ్బందిని పెంచుకుని ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. పేషంట్ రాగానే డయాలసిస్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. కొన్ని సెంటర్లను నిమ్స్ ఆసుపత్రి, మరికొన్నింటిని ఉస్మానియా ఆస్పత్రి నిర్వహిస్తున్నాయి. పూర్తిగా ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నాము. ఒక్కో డయాలసిస్ పేషంట్ పై సంవత్సరానికి లక్షా ఎనభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. టిఎ, డిఎ ఇవ్వడంలేదని డాక్టర్స్ రావడంలేదని సూభాష్ రెడ్డి లేవనెత్తారు అటువంటి సమస్య ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నా. రోగి వేచి చూడకుండా సిబ్బందిని, మిషన్లను పెంచుకుంటాము. కిడ్నీ సమస్యలు వచ్చి డయాలసిస్ చేసుకుంటున్న కుటుంబం నరకం అనుభవిస్తుంది. వారి బాధను తీర్చే భాద్యత తెలంగాణ ప్రభుత్వానిదే అని మంత్రి తెలిపారు.