YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ ముందే ఊహించారా

కేసీఆర్ ముందే ఊహించారా

కేసీఆర్ ముందే ఊహించారా
కరీంనగర్, మార్చి 12
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ఎంపిక చేస్తూ ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ నియామకం వెంటనే అమల్లోకి రానుందని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారనే విషయాన్ని సీఎం కేసీఆర్ ముందుగానే ఊహించారా? గత కొన్ని రోజులుగా కేసీఆర్ కరీంనగర్ మీదే ఫోకస్ చేయడం ఈ సందేహాలకు తావిస్తోంది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కరీంనగర్ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. మూడు నెలల కాలంలో రెండుసార్లు కరీంనగర్‌లో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన కోసం ఓసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కరీంనగర్ జిల్లాలో అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సైకిల్ ఎక్కడం, ట్రాక్టర్‌పై వెళ్లడంలాంటి పనులు సరికాదని సీఎం కేసీఆర్ వారికి స్పష్టం చేశారు. సొంత పబ్లిసిటీ కోసం పాకులాడొద్దని హెచ్చరించారు. సొంత ఎజెండాలతో పనులు చేయవద్దని...ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేయాలని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.తెలంగాణలో 33 జిల్లాలో ఉండగా, సీఎం కేసీఆర్ కరీంనగర్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం వెనుక దూరదృష్టి ఉందని టీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందని ముందస్తుగానే అంచనా వేసిన కేసీఆర్ ప్రత్యేకించి కరీంనగర్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు త్వరలోనే తన సీఎం పదవిని తనయుడు కేటీఆర్‌కు అప్పగించాలనే యోచనలో ఉన్న కేసీఆర్... ఆ తరువాత జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తప్పాలని భావిస్తే... ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేసీఆర్ తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌ను ఎంపిక చేసుకున్నారని... రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ గెలిచిన కరీంనగర్ స్థానాన్ని... రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. కరీంనగర్‌లో తాను పోటీ చేయడం ద్వారా ఉత్తర తెలంగాణవ్యాప్తంగా బీజేపీకి చెక్ చెప్పొచ్చని భావనలో కేసీఆర్ ఉన్నారనే విశ్లేషణులు కూడా వినిపిస్తున్నాయి.

Related Posts