YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ లో రేవంత్ ఒంటరి

టీ కాంగ్రెస్ లో రేవంత్ ఒంటరి

టీ కాంగ్రెస్ లో రేవంత్ ఒంటరి
హైద్రాబాద్, మార్చి 12
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఒంట‌రి వార‌య్యారు. చిన్న కేసులో వారం రోజులుగా జైలులో ఉన్న ఆయ‌న‌కు స్వంత పార్టీ వారి నుంచే స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. రేవంత్ రెడ్డి అరెస్టును ఇంత‌వ‌ర‌కు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఖండించ‌లేదు. వి.హ‌నుమంత‌రావు లాంటి నాయ‌కులు రేవంత్‌పైనే రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో రేవంత్ అనుచ‌రుల్లో కాంగ్రెస్ నేత‌ల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. త‌మ నాయ‌కుడిని ఉద్దేశించి రైట్ ప‌ర్స‌న్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై పోరాడ‌టంలో రేవంత్ రెడ్డి ముందుంటారు. ఒక‌ర‌కంగా వీరి మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరం న‌డుస్తోంది. కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఆరోప‌ణ‌లు చేస్తుంటారు రేవంత్‌. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా, పీసీసీ నుంచి అనుమ‌తులు గ‌ట్రా ఏమీ లేకుండా కొత్త విష‌యాల‌ను తెర‌పైకి తీసుకొచ్చి ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే వీహెచ్ లాంటి సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. రేవంత్ రెడ్డి మీద గోప‌న్‌ప‌ల్లి భూలావాదేవీల‌కు సంబంధించి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంలో ఓ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు కూడా తీసుకుంది. అయితే, ఈ భూముల వ్య‌వ‌హారాలకు సంబంధించి త‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు రేవంత్ రెడ్డి స‌రైన రీతిలో కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయారు. ఇందుకు బ‌దులుగా ఎదురుదాడికి దిగారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ అక్ర‌మం అంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు ప్రారంభించారు.కేటీఆర్ ఫామ్ హౌజ్ జీఓ నెం.111ను ఉల్లంఘించి క‌ట్టార‌ని రేవంత్ రెడ్డి కొత్త విష‌యాన్ని తెర‌పైకి తెచ్చి ఫామ్ హౌజ్ వ‌ద్ద అనుచ‌రుల‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఫామ్ హౌజ్ విష‌యాన్ని బ‌య‌ట‌కు తేవ‌డానికి డ్రోన్ ఉప‌యోగించార‌నేది రేవంత్‌పై అభియోగం. ఈ కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన‌ప్పుడు కాంగ్రెస్ నేత‌లు నామ‌మాత్రంగానే స్పందించారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌, ష‌బ్బీర్ అలీ వంటి కొంద‌రు సీనియ‌ర్లు మాత్ర‌మే అరెస్టును ఖండించారు.ఒక పార్ల‌మెంటు స‌భ్యుడిని పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు అరెస్ట్ చేస్తే ఈ విష‌యాన్ని లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తే అవ‌కాశం ఉన్నా కాంగ్రెస్ ఆ ప‌ని చేయ‌లేదు. అసెంబ్లీలోనూ ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టాల్సి ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా చేయ‌లేదు. ఇప్పుడు వి.హ‌నుమంత‌రావు అయితే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాద‌ని రుజువు చేసుకోవాల్సింది పోయి ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని రేవంత్‌నే ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీకి చెప్ప‌కుండా ఎవ‌రి వ్య‌క్తిగ‌త పోరాటాలు వారు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న అడుగుతున్నారు. రేవంత్ శైలిపై పార్టీలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇక‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, సీనియ‌ర్ నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ వ్య‌వ‌హార శైలి కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఏదైతే జీవో నెం.111ను ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హౌజ్‌ను నిర్మించార‌ని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారో, ఆ జీవోనే ర‌ద్దు చేయాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వ‌ల్ల త‌మ ప్రాంతంలో అనేక మంది రైతులు, పారిశ్రామిక‌వేత్త‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, కాంగ్రెస్ హ‌యాంలోనే ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని తాము ప్ర‌తిపాదించామ‌ని చెబుతున్నారు. ఇవ‌న్ని రేవంత్ వ‌ర్గీయుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. రేవంత్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ పెట్టాల‌ని కూడా వారు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ చేస్తున్నారు.

Related Posts