.2036 వరకు రష్యాకు పుతినే...
మాస్కో, మార్చి 12
రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. మరో నాలుగేళ్లలో తన పదవీ కాలం ముగియనుండగానే, ఆపై మరో 12 సంవత్సరాల వరకూ తనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. 2024 తరువాత మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలకు రష్యా పార్లమెంట్ తో ఆమోద ముద్ర వేయించుకున్నారు.ఈ మేరకు 'ద స్టేట్ డ్యూమా' దేశ రాజ్యాంగ సవరణలకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం. 43 మంది పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. కాగా, 'ద స్టేట్ డ్యూమా' ఈ సవరణలకు ఆమోదం పలికిన గంటల వ్యవధిలోనే ఎగువ సభ 'ఫెడరేషన్ కౌన్సిల్' ఆమోదం కూడా లభించింది.ఇక ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరుగనుండగా, అది నామమాత్రమే. ఈలోగా రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను మరోసారి సమీక్షించనుంది. గడచిన రెండు దశాబ్దాలుగా పుతిన్ రష్యా రాజకీయాలను ఏలుతూ, తిరుగులేని స్థానంలో ఉన్నారు.