YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉనికి కోసం నేతల పోరాటం

ఉనికి కోసం నేతల పోరాటం

.ఉనికి కోసం నేతల పోరాటం
అదిలాబాద్, మార్చి 12,
ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఆ ప్రాంతంలో నేడు ఎర్ర జెండాలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల పాటు తమ పట్టును నిలబెట్టుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ కోల్పోవడానికి కారణం... ఆ పార్టీ సిద్ధాంతాలా? అంగ, ఆర్థిక బలం లేకపోవడమా? నాలుగు సార్లు కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి భవిష్యత్తులో పార్టీని ముందుకు నడిపించగలరా?మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్‌ అంటే మచ్చ లేని నాయకుడిగా అందరికీ సుపరిచితులే. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన మల్లేశ్‌.. ఆ దిశగానే తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు. సింగరేణి కార్మికునిగా చేరిన ఆయన.. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి శాశ్వతంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన... 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో బెల్లంపల్లి నియోజకవర్గంగా ఏర్పాటైంది. బెల్లంపల్లి నుంచి 2009లోను సీపీఐ ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయేలా ఉందనే టాక్‌ నడుస్తోంది. మళ్లీ ఈ ప్రాంతంలో సీపీఐలో ఉండి, ఎమ్మెల్యే గెలుపొందే అవకాశాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. గుండా మల్లేశ్‌ లాంటి సీనియర్లకు ఇప్పటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు. గతంలో సింగరేణి కార్మికులలో కమ్యూనిస్టుల అభిమానం ఉండటం, ఇతర పార్టీలతో పొత్తులుండడంతో ఆ పార్టీ కొన్ని సీట్లను గెలుచుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యాయి. కమ్యూనిస్టుల పట్ల జనాల్లో కూడా విశ్వాసం తగ్గిపోతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మల్లేశ్‌ లాంటి నాయకులు గెలవడం కష్టమేనని చెబుతున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే చెప్పుకోవాలని అనుచరులు గుసగుసలు ఆడుకుంటున్నారు.ధన బలం లేకపోవడం, ఎప్పుడు కూడా అధికారంలోకి రాకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరో ఇద్దరో మాత్రమే గెలవడం లాంటి ఎన్నో కారణాలు సీపీఐ వెనుకబాటుకు కారణమంటున్నారు. వ్యక్తగత ఇమేజ్‌తోనో, కార్మికుల ఓట్లతోనో, ఇతర పార్టీల పొత్తులతోనో గెలిచేవారనే వాదనలే ఎక్కువ. డబ్బు, అధికార బలం లేకపోవడంతో కేడర్‌ను పెంచుకోవడంలో కూడా వెనుకబడిపోయారని అంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్‌ లాంటి కార్మిక నేతలకు గానీ, సీపీఐ తరఫున మరొక నేత గానీ ఇక్కడ మళ్లీ గెలిచే అవకాశాలు లేవనే అంటున్నారు. పార్టీ తరఫున గెలవాలన్నా.. పార్టీని నడిపించాలన్నా డబ్బు, అధికారం తప్పనిసరి అని కమ్యూనిస్టు వర్గాలే అనుకుంటున్నాయి.

Related Posts