మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 517వ వర్ధంతి ఉత్సవాలు
తిరుపతి, మార్చి 12
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 517వ వర్ధంతి ఉత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకలో ఘనంగా జరుగనున్నాయి. మార్చి 20వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. మార్చి 21న సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు. అదేవిధంగా, మార్చి 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు, పండితులు పాల్గొంటారు. అన్నమాచార్య కళామందిరంలో మార్చి 22, 23వ తేదీల్లో సాహితీ సదస్సులు జరుగనున్నాయి. వివిధ ప్రాంతాల నుండి 10 మంది పండితులు అన్నమాచార్య సాహిత్యంపై ఉపన్యసిస్తారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.