. చావు దెబ్బ తీసిన అమెరికా
న్యూఢిల్లీ, మార్చి 12
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 రోజులపాటు యూరప్ దేశాలతో సరిహద్దులు మూసేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. యూకే, ఐర్లాండ్‌లకు మాత్రం అమెరికా మినహాయింపు ఇచ్చింది. అమెరికా, యూరప్ మధ్య ప్రజల ప్రయాణాలపైనే కాకుండా వాణిజ్యంపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కరోనా వైరస్ వ్యాప్తికి యూరోపియన్ యూనియన్ కారణమని ట్రంప్ ఆరోపించారు.అమెరికన్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని.. వయసు మీద పడిన వారు జనాల్లో తిరగడాన్ని తగ్గించుకోవాలని ట్రంప్ సూచించారు. కరోనా బారిన పడిన వారికి, వారి పట్ల శ్రద్ధ తీసుకుంటున్న వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు కరోనా ప్రభావానికి గురైన రంగాలకు కూడా సాయం అందిస్తామన్నారు. కరోనాను అరికట్టడానికి అమెరికా తరహాలో మరే దేశం కూడా సన్నద్ధం కాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.గత 14 రోజుల్లో యూకే, ఐర్లాండ్ మినహా యూరప్‌లోని 26 దేశాల్లో ప్రయాణించిన వారిపైనా అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. అమెరికా శాశ్వతంగా నివాసం ఉంటున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.ట్రంప్ నిర్ణయం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోగా.. బీఎస్ఈ సెన్సెక్స్ 3000 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 905 పాయింట్ల నష్టపోయింది. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ. 11.45 లక్షల కోట్లు నష్టపోయారు.