భారత్ పై వీసాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ, మార్చి 13,
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కుదేలయిన పర్యాటక రంగం, విమానయాన పరిశ్రమలు దాదాపు నెల రోజుల పాటు వీసాలను నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కోలుకోలేని స్థితికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ రెండు రంగాలపై కనీసం రూ.8,500 కోట్ల మేర తక్షణ ఆర్థిక ప్రభావం పడవచ్చని నిపుణులు అంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు వీసాలను నిలిపివేయడంతో పాటుగా పరిమిత నగరాలగుండా మాత్రమే దేశంలోకి విదేశీయలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ రంగాల్లోని కంపెనీలు అత్యవసరం కాని విభాగాల్లో సిబ్బందిని తొలగించడం, అలాగే రిక్రూట్‌మెంట్లను నిలిపివేయడం లాంటి చర్యలకు పాల్పడవచ్చని, ఫలితంగా ఈ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని భారతీయ టూరిజం ఆపరేటర్ల అసోసియేషన్ (ఐఎటిఓ), అసోచామ్‌లాంటి పారిశ్రామిక సంఘాలు అంటున్నాయి. నెల రోజుల పాటు ప్రయాణాలపై నిషేధం విధించడంవల్ల మొత్తం హోటల్, పర్యాటక , విమానయాన రంగాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావంపడనుందని, ఇది ప్రత్యక్షంగా కనీసం రూ.8,500 కోట్లకు తక్కువకాకుండా ఉండవచ్చని తాము భావిస్తున్నామని ఐఎటిఓ కార్యదర్శి రాజేశ్ ముద్గిల్ చెప్పారు. కాగా ఈ రంగాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నాయని, అయినప్పటికీ అత్యవసర ప్రయాణాలు కొనసాగుతున్నందున సిబ్బందిని కొనసాగిస్తున్నామని అసోచామ్ టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ అంటూ, వీసాలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం తీసుకున్న నిర్ణయం ఈ రంగానికి అశనిపాతంగా మారిందని అన్నారు. వీసాలు చెల్లకపోవడం వల్ల రాబోయే పది రోజుల్లో దాదాపుగా స్తంభించిపోతుందని. అంటే ప్రతిఒక్కరు కూడా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అత్యవసరం కాని సిబ్బందిని తొలగించడంతో పాటుగా కొత్తగా ఎవరినీ రిక్రూట్ చేసుకోరని ఆయన హెచ్చరించారు.