కరోనా దెబ్బకు చికెన్ ఫట్
హైద్రాబాద్, మార్చి 13
కరోనా ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలలో చికెన్ వ్యాపారం కుదేలైంది. వ్యాపారులు చికెన్ ధరలను అమాంతం తగ్గిం చేస్తున్నారు. ఎంతగా అంటే ఇప్పటి వరకు కనివినీ ఎరుగని రీతిలో రూ.100కే మూడు కిలోలు అంటున్నారు. మరికొన్ని చోట్ల రూ.25 నుంచి రూ.30కు అమ్ముతున్నారు. మరికొందరు వ్యాపారులైతే ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకే చికెన్ అమ్ముతున్నారు. ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకే చికెన్‌ను అమ్ముతున్నారు. వాస్తవానికి చికెన్‌ను తింటే ఏమీ కాదని దాని వల్ల ప్రాణ హానీ ఉండదని.. చికెన్ ఉడికించి తినడం వల్ల వైరస్ అనేది ఏదీ రాదని చెబుతున్నప్పటికీ ఇందుకు సంబంధించి హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో చికెన్ మేళా నిర్వహంచినా కరోనా భయంతో ఎవరూ చికెన్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర రూ.100కి పడిపోయింది.అయితే చికెన్ ధరలు తగ్గించడం వల్ల కొన్ని చోట్ల గిరాకీ బానే అవుతోందని జనాలు క్యూకట్టి మరీ చికెన్ కొనుక్కుని వెళ్తున్నారని షాపు యజమానులు అంటున్నారు. నెల రోజుల క్రితం ఇదే చికెన్ ధర హైదరాబాద్‌లో రూ.180 నుంచి రూ.200గా ఉంది. కరోనా ప్రభావంతో ఒక్కసారిగా చికెన్ వాడకం తగ్గిపోవడంతో వ్యాపారులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ చికెన్‌ని విక్రయిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాల్లో ఈ ఆఫర్ల హోరు జోరుగా కొనసాగుతోంది. రూ.100కే మూడు కిలోల చికెన్ అంటూ విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల రెండు కోళ్లు రూ.100కే అని ఆఫర్‌తో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లతో వ్యాపారులకు తమ వద్దనున్న చికెన్‌ను విక్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం ఇదే పద్ధతిలో చికెన్‌ను అమ్మేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.లాభాల మాట దెవుడెరుగు..పెట్టిన పెట్టుబడి వస్తే చాలునన్న స్థాయిలో చికెన్ విక్రయాలను కొనసాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లోనయితే ఏకంగా ప్రత్యేక ఆఫర్ల బోర్డులను పెట్టి చికెన్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. తమ వద్ద వున్న సరుకుని అందినకాడికి అమ్ముకునేందుకే పలుచోట్ల చికెన్ వ్యాపారులు యత్నిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ జిల్లాల్లో మాత్రం చికెన్ పట్ల ప్రజలు అనాసక్తి కనబరుస్తున్నారు. దీంతో చికెన్ వ్యాపారులు ఏం చేయాలో పోలుపోని స్థితిలో ఆఫర్లనే నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చికెన్ వ్యాపారులు ఇదే తరహా వ్యాపార సూత్రాన్ని అవలంబిస్తున్నారు. రూ.100కే మూడు కిలోలు పేరిట చికెన్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల చికెన్ కొనేందుకు ఆసక్తి కనబర్చని ప్రాంతాల్లో వ్యాపారులు కిలో చికెన్ రూ.25 నుంచి రూ.30 వరకూ విక్రయాలు జరుపుతున్నారు.ఈ క్రమంలో పెట్టుబడి పెట్టిన డబ్బు రాక పోయినా సరే ఉన్న సరుకుని విక్రయించేందుకు చికెన్ వ్యాపారులు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. వాణిజ్య సంస్థలు కరోనా ఎఫెక్ట్‌తో నష్టాల బారి పడతున్నాయి. చైనాలో వ్యాపించిన ఈ కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో చికెన్ ధరలు మునుపెన్నడూ లేనంతగా దిగొచ్చి చికెన్ వ్యాపారులకు కొంతమేర నష్టాన్ని సమకూరుస్తున్నాయి.