YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇక్కడ చట్టం అమలవుతోందా ?

ఇక్కడ చట్టం అమలవుతోందా ?

ఇక్కడ చట్టం అమలవుతోందా ?
విజయవాడ, మార్చి 13
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ శాఖల తీరుపై హైకోర్టు విరుచుకుపడింది. అసలు ఇది రాష్ట్రమా... మరొకటా! అని విస్మయం వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలు అమలవుతున్నాయా అని  సందేహించింది. విశాఖపట్నంలో విపక్ష నేతను సీఆర్పీసీ 151 సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడంపై స్వయంగా హాజరైన డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక... పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ తీరునూ తప్పుపట్టింది. పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని... అసైన్డ్‌ భూముల్లో వారికేం పని అని ప్రశ్నించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన పొలాలను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
పోలీస్‌ బాస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు.. నోటీస్‌పై క్లాస్ 
చట్టం పాటించండి. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. అధికారులు నిష్పాక్షికంగా ఉండాలి. డీజీపీగా ఉండి మాతో చెప్పించుకుంటే ఎలా? 151 సెక్షన్‌ కింద విపక్ష నేత అరెస్టు సరైనదేనా? అక్కడ తీవ్ర నేరం ఎవరు చేయబోయారు? న్యాయ పాలన చేయాల్సింది ఇలాగేనా? రాష్ట్రంలో నిబంధనల అమలు సరిగా లేదు. రాజధాని గ్రామంలో అంతమంది పోలీసులా?కశ్మీర్‌లో 500 మందితో కవాతు చేస్తే సరే! ఇక్కడ చేయించాల్సిన అవసరం ఏమిటి? ఇలాగైతే జోక్యం చేసుకోక తప్పదు: హైకోర్టు బాబుకు ఆ నోటీసు తప్పే.. డీజీపీ అంగీకారం. సెక్షన్‌ను ఆయనతో చదివించిన ధర్మాసనం. పోలీస్‌ బాస్‌ గౌతం సవాంగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఇదేనా పద్ధతి’ అని నిలదీసింది. అటు విశాఖపట్నంలో సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద విపక్షనేత చంద్రబాబును అరెస్టు చేయడం... ఇటు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ విధింపుపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి డీజీపీని ఉక్కిరి బిక్కిరి చేసింది. విశాఖ ఉదంతం అనంతరం... చంద్రబాబుకు తగిన భద్రత కల్పించాలని, ఆయన పర్యటనలు, శాంతియుత నిరసనలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేలా పోలీసుల్ని ఆదేశించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టి.శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌ గురువారం త్రిసభ్య ధర్మాసనం ముందు హాజరయ్యారు. ప్రతిపక్ష నేతకు సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? చట్ట నిబంధనలు, న్యాయపాలన అమలు తీరు ఇదేనా అని ప్రశ్నించింది. చట్టాల అమలుపై సాక్షాత్తు డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ జోక్యం తప్పదని, ఈ వ్యవహారాలపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక.. ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్న రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించడం, వందలాదిమంది పోలీసుల్ని మోహరించడం, మహిళలు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Related Posts