
తాడిపత్రిలో జేసీపై దాడికియత్నం
అనంతపురం, మార్చి 13
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీపై దాడికియత్నం జరిగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేశారు. వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి... తెదేపా తరఫున నామినేషన్ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు తెదేపా అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు. ఈవిషయం తెలుసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నందున తర్వాత పంపిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతుండగా... వైకాపా నాయకులు ఒక్కసారిగా దివాకర్‌రెడ్డి వైపు దూసుకెళ్లారు. పక్కనే ఉన్న వైకాపా నాయకుడు దివాకర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని జేసీని సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. అయినా కార్యాలయం వెలుపల ఇరువర్గాలు గుమిగూడాయి.