YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫరూక్ కు విముక్తి

ఫరూక్ కు విముక్తి

ఫరూక్ కు విముక్తి
శ్రీనగర్, మార్చి 13
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా లోయలోని పలువురు నేతలను గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ప్రజా భద్రత చట్టం కింద జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. తాజాగా, ఫరూక్‌ గృహనిర్బంధాన్ని కేంద్రం ఎత్తివేసింది. దీంతో ఏడు నెలల నిర్బంధం అనంతరం ఆయన విడుదల కానున్నారు. ఫరూక్‌‌ అబ్దుల్లాపై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్నిఉపసంహరించారు. కేంద్ర హోంశాఖ సూచనలతో ఫరూక్‌పై ఉన్న నిర్బంధాన్ని ఎత్తివేయాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడం.. శాంతియుత వాతావరణం నెలకున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే గవర్నర్‌ తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. శ్రీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఫరూక్‌ అబ్దుల్లా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దుల్లాను చాలా మంది నేతలు కలవడానికి ప్రయత్నించారు. చివరకు ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది.కశ్మీర్‌లో కీలక నేతగా ఉన్న ఫరూక్ అబ్దుల్లాపై సెప్టెంబరు 16న ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ఆరు నెలల కాలం పూర్తికావడంతో దీనిని ఫిబ్రవరి 8న మరోసారి పొడిగించారు. వాస్తవానికి ఈ చట్టం కింద ఎవరినైనా అదుపులోకి తీసుకుంటే ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్ల పాటు నిర్బంధించవచ్చు. ఫరూక్‌ తనయుడు ఒమర్‌ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా మరికొందరు నేతలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. విచారణ లేకుండా మూడు నెలలు లేక అంతకన్నా ఎక్కువ రోజులు నిర్బంధించే ఈ కఠిన చట్టాన్ని సాధారణంగా ఉగ్రవాదులు, రాళ్లు దాడులకు పాల్పడేవారిని నిర్బంధించడానికి ఉపయోగిస్తారు.

Related Posts