కరోనా వైరస్‌పై ఐక్య పోరాటానికి కలిసి రావాలి
సార్క్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ, మార్చి 13
కరోనా వైరస్‌పై ఐక్య పోరాటానికి కలిసి రావాలని సార్క్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన భూభాగం కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుందన్న మోదీ.. దీన్ని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ జనాభాలో అత్యధికంగా జనాభా ఉన్న దక్షిణాసియాలో ఈ వైరస్‌ను అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఒక బలమైన వ్యూహాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నానని మోదీ అన్నారు. మన పౌరుల ఆరోగ్యం గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిద్దామని మోదీ ప్రతిపాదన చేశారు.
సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి) దేశాలు.. భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్.
కలిసికట్టుగా పని చేద్దాం : భూటాన్ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌పై భూటాన్ ప్రధాని లోటాయ్ త్సెరింగ్ స్పందించారు. నాయకత్వమంటే ఇది అని మోదీని ఆయన ప్రశంసించారు. ఈ ప్రాంత సభ్యులైన మనం ఈ సమయంలో కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో తప్పకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాను అరికట్టేందుకు తప్పకుండా పని చేస్తామన్నారు భూటాన్ ప్రధాని. మోదీ చొరవ అభినందనీయం : మాల్దీవుల అధ్యక్షుడు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొంటూ మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్ముద్ ధన్యవాదాలు తెలిపారు. కరోనాను తరిమికొట్టేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. మోదీ ప్రతిపాదనను తమ ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. పూర్తిగా మద్దతు ఇస్తామని ఇబ్రహీం స్పష్టం చేశారు. శ్రీలంక సిద్ధం కరోనాను నియంత్రించే చర్చలో చేరడానికి శ్రీలంక సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు గోటబయా రాజపక్స స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సమయాల్లో సంఘీభావంతో ఐక్యంగా ఉండి, మన పౌరులను సురక్షితంగా కాపాడుకోవాలని రాజపక్స అన్నారు. పౌరులను రక్షించుకుందాం.. ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రకటించారు. సార్క్ దేశాలతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ భయంకరమైన వైరస్ నుంచి మన ప్రజల్ని సురక్షితంగా ఉంచుకోవాలని కేపీ శర్మ అన్నారు.