Highlights
- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఢిల్లీ పర్యటన
- ఎన్నికలంటే వైసీపీకి భయం
- ముఖ్యమంత్రి చంద్రబాబు
కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా... అని ప్రశ్నించారు. సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి ఎందుకు న్యాయం చేయరని?, కేంద్రానికి బాధ్యత లేదా..అంటూ చంద్రబాబు నిలదీశారు. ఏదిఏమైనా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని...అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని..మంగళ,బుధవారాల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు.కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్ధ్యమని తెలిపారు.
ఢిల్లీలోనే కాదు, రాష్ట్రం యావత్తూ తన పర్యటనపై అంచనాలున్నాయని ఎంపీలతో సీఎం అన్నారు. ప్రజల్లో ఆకాంక్షలున్నాయన్నారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని 19అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇచ్చిన 6హామీలు నెరవేర్చాలన్నారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్ధమయ్యాయని తెలిపారు. ఎన్నికలంటే వైసీపీకి భయం..అందుకే పార్లమెంట్ చివరిరోజున రాజీనామాలకు తెరతీశారని ఎంపీలతో చంద్రబాబు అన్నారు.