YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 పొంగులేటి వ్యూహాలు ఏంటీ

 పొంగులేటి వ్యూహాలు ఏంటీ

 పొంగులేటి వ్యూహాలు ఏంటీ
ఖమ్మం, మార్చి 14,
ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అర్థ‌బ‌లం, అనుచ‌ర బ‌ల‌గం దండిగా ఉన్నా రాజ‌కీయంగానే అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వ‌లేదు. త‌ర్వాత ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తామ‌ని పార్టీ మాటిచ్చింది. ఈసారి ఆయ‌న‌ను క‌చ్చితంగా రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని అంతా భావించారు. పొంగులేటి కూడా ఈ ప‌ద‌వి ప‌ట్ల ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, టీఆర్ఎస్ అధిష్టానం ఆయ‌న ఆశ‌లు అడియాస‌లు చేసింది. పొంగులేటికి మ‌రోసారి నిరాశ‌నే మిగిల్చింది. దీంతో ఇప్పుడు ఆయ‌న వైఖ‌రి ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వ‌తాహా వ్యాపార‌వేత్త‌. కానీ త‌క్కువ కాలంలోనే ఆయ‌న రాజ‌కీయంగా బాగా ఎదిగారు. 2014 ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా గెలిచి సంచ‌ల‌నం సృష్టించారు. త‌ర్వాత ఆయ‌న వైసీపీ తెలంగాణ అధ్య‌క్ష హోదాలో ప‌ని చేశారు. ఖ‌మ్మం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బ‌ల‌మైన వ‌ర్గాన్ని నిర్మించుకున్నారు.త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పొంగులేటి చేరిక‌తో అప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆధిప‌త్యానికి చెక్ ప‌డింది. జిల్లా పార్టీ రెండు వ‌ర్గాలుగా మారింది. ఈ నేప‌థ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు వ‌ర్గాలు ఒక‌రినొక‌రిని ఓడించుకునేందుకు ప్ర‌య‌త్నించాయి. దీంతో ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ జిల్లాలో కేవ‌లం ఒకే సీటుకు ప‌రిమితం అయ్యింది. ఈ ఫ‌లితాల‌తో పొంగులేటి, తుమ్మ‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో సిట్టింగ్ ఎంపీ అయినా 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొంగులేటికి ఎంపీ సీటు ఇవ్వ‌లేదు. ఈ స‌మ‌యంలో పొంగులేటితో పాటు ఆయ‌న వ‌ర్గంలో ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది. పొంగులేటి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లి పోటీ చేస్తార‌నే చ‌ర్చ కూడా జ‌రిగింది. ఒక‌వేళ ఆయ‌న టీఆర్ఎస్‌ను వీడితే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి చాలా న‌ష్టం జ‌రిగేది. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయ‌న‌ను బుజ్జ‌గించి ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థి గెలుపు కోసం ప‌ని చేసేలా చేసింది. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తామ‌ని హామీ ఇచ్చారు.దీంతో ఇప్పుడు ఖాళీ అయిన రెండుసీట్ల‌లో ఒకటి పొంగులేటికి ఖాయం అని అంతా అనుకున్నారు. ఆయ‌న వ‌ర్గం కూడా ఇదే ఆశ‌లు పెట్టుకుంది. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఆయ‌న పేరు వినిపించినా ఆయ‌న పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో పొంగులేటి వ‌ర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు. ఇంకా ఓపిక ప‌ట్ట‌డం స‌రికాద‌ని పొంగులేటిని కోరుతున్నారు. అయితే, ఎవ‌రూ తొంద‌ర‌ప‌డొద్ద‌ని, పార్టీపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని పొంగులేటి త‌న వ‌ర్గీయుల‌ను సోష‌ల్ మీడియాలో కోరారు.ఆయ‌న కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పొంగులేటి అంటే కోపం ఉంద‌ని, టీఆర్ఎస్‌లో ఉంటే ఆయ‌న రాజ‌కీయంగా పైకి రార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే, పొంగులేటి జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కుడ‌ని తెలిసి కూడా టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్ట‌ర్‌. ఆయ‌న తెలంగాణ‌లో వంద‌ల కోట్ల విలువ చేసే ప‌నులు చేస్తున్నారు. ప్ర‌భుత్వంతో ఆయ‌న‌కు మంచి సంబంధాలు అవ‌స‌రం. అందుకే ఆయ‌న ఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ మార‌ర‌నే ఉద్దేశ్యంతోనే పొంగులేటిని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టేశార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. మ‌రి, శ్రీనివాస్‌రెడ్డి ఆలోచ‌న ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts