హాట్ కేక్ లా హైద్రాబాద్ ఆఫీస్ స్పేస్
హైద్రాబాద్, మార్చి 14,
ఐటీ రంగం అభివృద్ధితో రోజురోజుకూ ఆఫీస్ స్పేస్ వినియోగం పెరుగుతున్నది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగానికి వేదికగా మారిన హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అధికమైంది. దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ వినియోగంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలే సగం వాటాను కలిగి ఉన్నాయి. కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఆక్యుపెన్సీ రేటు పెరగటం, పెట్టుబడుల పెరుగుదలతో 2019 సంవత్సరంలో రికార్డు స్థాయిలో సౌకర్యవంతమైన ఆఫీస్ స్పేస్ వినియోగం పెరిగింది. 2019లో సౌకర్యవంతమైన ఆఫీస్ స్పేస్ వినియోగం 10.8 మిలియన్ చ.అడుగులకు చేరుకున్నది. 2018 సంవత్సరంతో పోలిస్తే ఆఫీస్ స్పేస్ వినియోగం 60 శాతం పెరిగింది. ఆఫీస్ స్పేస్ వినియోగం 2018లో 19 మిలియన్ చ.అడుగులుగా ఉంటే, 2019లో 30 మిలియన్‌లకు చేరుకున్నది. అధిక శాతం ఆపరేటర్లు నిర్దిష్ట యాప్‌లను వినియోగిస్తున్నారు. ఇవి ఇంటర్ గ్రూప్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లను అందిస్తాయి. ఈ వేదికగా వినియోగదారులు తమ వ్యాపార అవసరాలను పోస్టు చేయవచ్చు. ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు రాబోయే త్రైమాసికాల్లో వారి కేంద్రాల్లో రోబోటిక్ సాంకేతికతను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. కార్యాలయ స్థలాల విషయంలో ఆపరేటర్లు తమ టెక్ ప్లాట్‌ఫామ్‌లను సమర్థవంతంగా రూపకల్పన చేసేందుకు, యజమానుల కార్యకలాపాలను నిర్వహించడాన్ని పర్యవేక్షిస్తుండటం విశేషం.పలు కార్పొరేట్ సంస్థలు పెద్ద పరిమాణ స్థలాలను లీజు తీసుకోవడం వల్ల ఆక్సుపెన్సీ రేటు పెరుగుతున్నది. కార్పొరేట్‌లు ఈ ఖాళీలను క్యాపెక్స్‌ను తగ్గించడానికి, స్థాన ప్రయోజనాన్ని అందించడానికి, పోర్టుఫోలియోల చురుకుదనాన్ని పెంచడానికి సహాయపడతాయి. 2019లో పెట్టుబడి పెరిగిందనడానికి ఏంజెల్ ఇన్వెస్టర్లు, పీఈ ఫండ్లు, డెట్ ఫండ్స్ అందించిన సుమారు 140 మిలియన్ డాలర్ల నిధులే నిదర్శనం. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మొత్తం వాటా 2019లో 14 శాతం ఉండగా, అది 2020 చివరి నాటికి 16 నుంచి 20 శాతానికి పెరుగుతుందని, 10 నుంచి 12 మిలియన్ చ.అడుగులకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2020లో ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు ప్రధానంగా హైదరాబాద్, పూణే, చెన్నై నగరాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తారని అంచనా వేస్తున్నారు