YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనావైరస్ నుండి పరిశ్రమను ఆదుకోండి  ఉపరాష్ట్రపతికి పౌల్ట్రీ యజమాన్యాల విజ్ఞప్తి

కరోనావైరస్ నుండి పరిశ్రమను ఆదుకోండి  ఉపరాష్ట్రపతికి పౌల్ట్రీ యజమాన్యాల విజ్ఞప్తి

కరోనావైరస్ నుండి పరిశ్రమను ఆదుకోండి
     ఉపరాష్ట్రపతికి పౌల్ట్రీ యజమాన్యాల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి 14
కరోనావైరస్ (కొవిడ్-19) మహమ్మారి ప్రభావం దేశీయ పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి పరిశ్రమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ చైర్మన్ బహదూర్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును స్వయంగా కలిసి తమ సమస్యలను వివరించింది. కరోనావైరస్ వ్యాపించిన నేపథ్యంలో పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉపరాష్ట్రపతికి నివేదించింది. పౌల్ట్రీ పరిశ్రమకు వాటిల్లిన ముప్పు గురించి తప్పుడు వార్తలు ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం భారీగా తగ్గిందని వారు తెలియజేశారు. పౌల్ట్రీ రంగం ఆర్థిక ఒత్తిడికి లోనవుతోందని, రుణాల రీ షెడ్యూల్ చేయాలని కోరారు. అమెరికన్ జీవశాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లిప్టన్‌ను ఉటంకిస్తూ ‘కరోనావైరస్ భయం వైరస్ కంటే చాలా ఘోరమైనది’ అని అన్నారు. అన్ని రకాల పుకార్లు విరమించుకోవాలని, పరిశ్రమను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగాలని ఆయన నొక్కి చెప్పారు. ఉపరాష్ట్రపతి నాయుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవతో మాట్లాడారు. కోడి మాంసం, గుడ్ల వినియోగంపై ప్రజలలో ఉన్న భయాలను తొలగించడానికి ఐసీఎంఆర్ సలహా ఇవ్వమని సూచించారు ఉపరాష్ట్రపతి. వినియోగదారులకు, అమ్మకందారులకు భరోసా ఇవ్వడానికి సరైన సమాచారం వ్యాప్తి అవసరమని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో కోట్లాది మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడుతున్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రజలకు పోషక భద్రత కల్పించడమే కాకుండా, రైతులకు ద్వితీయ ఆదాయాన్ని కల్పించడంలో ఈ రంగానికి కీలక పాత్ర ఉందని అన్నారు.ఈ విషయమై పరిశీలించాలని సమావేశానికి హాజరైన ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను నాయుడు కోరారు. ప్రజలకు సరైన సమాచారం అందించడంలో సమిష్టి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్ని వాటాదారులను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి అవసరమైన వాటిని చేస్తుందని ఠాకూర్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఎఐపీబీఏ) ఉపాధ్యక్షుడు సురేష్ చిత్తూరి తదితరులు పాల్గొన్నారు.కోళ్ల వల్ల కరోనావైరస్‌ వ్యాపిస్తుందన్న వదంతుల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమకు ఒక నెలలోనే రూ.1750 కోట్ల నష్టం వచ్చిందని, పరిశ్రమకు సహాయక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఎఐపీబీఏ ఉపాధ్యక్షుడు సురేష్ చిత్తూరి తెలిపారు. ఫారమ్‌ గేటు స్థాయిలో పౌల్ట్రీ కోళ్ల ధరలు బాగా తగ్గాయని (కిలో రూ.10-30) అయితే సగటు ఉత్పత్తి ధర (కిలో రూ.80) అంతకు రెండింతలకు పైగా ఉందని పేర్కొన్నారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల కారణంగా వినియోగదార్ల నమ్మకాన్ని దెబ్బతీసుకున్నారని, దీని వల్ల చికెన్‌ ఉత్పత్తుల గిరాకీ పడిపోతోంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.బ్రాయిలర్‌ రైతులు, ఇంటిగ్రేషన్‌ కంపెనీలు, బ్రీడింగ్‌ కంపెనీలకు కలిపి జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం వరకు రూ.1750 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. దీని వల్ల పౌల్ట్రీ రంగంలో భారీ సంక్షోభం ఏర్పడిందని, ‘దివాలా’ దిశగా వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నెలకు రూ.1750 కోట్ల చొప్పున నష్టం వాటిల్లుతుందని ఆయన అంచనా వేశారు. సోయాబీన్‌, మొక్కజొన్న రైతులపైనా దీని ప్రభావం పడుతోందని, గత కొద్ది రోజుల్లోనే మొక్కజొన్న కిలో ధర రూ.25 నుంచి రూ.15కు చేరిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక సహాయక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదనంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ను ఇవ్వడంతో పాటు 90 రోజుల పాటు బకాయిలు చెల్లించకపోయినా నిరర్థక ఆస్తులుగా తమ బాకీలను పరిగణించరాదని విన్నవించారు. పౌల్ట్రీ రంగ రుణాలపై 5 శాతం వడ్డీ మినహాయింపుతో పాటు ప్రస్తుత టర్మ్‌ రుణాల చెల్లింపునకు ఏడాది పాటు అదనపు సమయం ఇవ్వాలని కూడా కోరారు. బియ్యం, గోధుమలను సబ్సిడీ రేటుకు ఇవ్వాలనీ ప్రభుత్వ నిల్వల నుంచి కనీసం 30 లక్షల టన్నులను కేటాయించాలని అడిగారు. మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాయదారి మహమ్మారి కరోనా కోడినీ దెబ్బేసింది. నిన్న మొన్నటి వరకూ కోడి కూరంటే లొట్టలేసుకుని తిన్న మాంసాహార ప్రియులు కరోనా వదంతుల దెబ్బకు ఆ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. దీంతో వ్యాపారం లేక పౌల్ర్టీ పరిశ్రమ కుదేలైంది. ఒక్క ఫిబ్రవరిలోనే బ్రాయిలర్‌ పరిశ్రమ రూ.200 కోట్ల నష్టాలు చవిచూసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లేయర్‌ పరిశ్రమలు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో గుడ్డు ధర రూ.4.50 నుంచి రూ.2.50కి పడిపోయింది. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న కోళ్ల ఫారాల నుంచి నెలకు 2 కోట్ల కోళ్లు ఉత్పత్తి అవుతాయి. సగటున ఒక కోడి 2.5 కేజీల లెక్కన పెరిగినా నెలకు సుమారు 5 కోట్ల కేజీల కోడి మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ ఏడాది జనవరి వరకు లైవ్‌ (బతికిఉన్న కోడి)చికెన్‌ని ఫారం దగ్గర కేజీ రూ.75కి విక్రయించేవారు. అంటే నెలకు రూ.375 కోట్ల వ్యాపారం నడిచేది. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి లైవ్‌ కోడి ధర అమాంతం తగ్గుతూ వచ్చింది. ఎక్కువ రోజులు రూ.30 నుంచి రూ.40 పలకడంతో ఆ నెలలో బ్రాయిలర్‌ వ్యాపారులు సుమారు రూ.200 కోట్ల మేర నష్టపోయారు.ప్రస్తుతం లైవ్‌ కోడి ధర కేజీ రూ.10 మాత్రమే. ఏపీలోనే కాదు కరోనా దెబ్బకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం కోళ్ల పరిశ్రమ విలవిల్లాడుతోంది. ముఖ్యంగా బ్రాయిలర్‌ మార్కెట్‌ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. లైవ్‌ చికెన్‌ కిలో రూ.10కి అమ్ముతున్నా కొనే నాధుడు కనిపించడం లేదు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పౌలీ్ట్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. చికెన్‌ తింటే కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం కావడంతో జనం దాని ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు వేసవిలో సాధారణంగా వచ్చే రాణికట్‌ వైర్‌సతో కోళ్లు చనిపోతుండడం కూడా పరిశ్రమకు శాపంగా మారింది. కానీ కరోనా వల్లే ఈ కోళ్లు చనిపోయాయనే ప్రచారం ఎక్కువైంది.ఈ పరిణామాలన్నీ చికెన్‌ విక్రయాలపై భారీగా ప్రభావం చూపుతున్నాయి. చికెన్‌ వ్యాపారం పూర్తిగా పడేకయడంతో బ్రాయిలర్లను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం పేపర్‌ ధర కిలో రూ.40 ఉండగా వ్యాపారులు రూ.10కు అడుగుతున్నారని ఫారాల యజమానులు వాపోతున్నారు. సాధారణంగా 45 రోజుల్లో రెండు రెండున్నర కేజీలు బరువు రాగానే కోళ్లను అమ్ముతుంటారు. కానీ కరోనా ప్రభావంతో నెల రోజులుగా కోళ్ల విక్రయాలు తగ్గిపోవడంతో ఫారాల్లో ఒక్కో కోడి మూడు మూడున్నర కేజీల బరువు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కోడిని ఏదోలా వదిలించుకోకపోతే రోజువారీ మేత ఖర్చు తడిసిమోపెడవుతుందని ఫారాల యజమానులు చెబుతున్నారు. కిలో కోడి తయారు కావడానికి సుమారు రూ.70 వరకు ఖర్చవుతుంది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4 వరకు ఖర్చవుతుంది.ధరల పతనంతో కిలో కోడిపై రూ.60 వరకు నష్టపోవాల్సి వస్తోంది. దాణా ఖర్చు తట్టుకోలేక ఏపీ, తెలంగాణ సరిహద్దులోని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో రెండు రోజుల క్రితం 3వేల కోళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుడ్లు పెట్టే కోళ్లు 5 కోట్ల ఉంటాయి. ఇవి సగటున రోజుకి 4 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. వీటిలో 35 శాతమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని ఒడిసా, బిహార్‌, బెంగాల్‌, అసోం రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. కరోనా వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. గుడ్డు ధర కూడా స్థానికంగా రూ.4.50 నుంచి రూ.2.50కి పడిపోయింది.మరోవైపు, కరోనా దెబ్బకు రాష్ట్రంలో చికెన్ వ్యాపారులకు తీరని నష్టం వాటిల్లుతుంది. చికెన్ తింటే ఎక్కడ తమకు కరోనా వ్యాపిస్తుందో అని చికెన్ ప్రియులు చికెన్ తినడం మానేసారు. దీంతో రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అప్పటినుంచి చికెన్ షాపులకు, పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మొన్నీమధ్య చికెన్, ఎగ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయాన కేటీఆర్ పాల్గొని చికెన్ తింటే ఎలాంటి అపాయం జరగదని చెప్పారు. దాంతో పాటుగానే ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ చాలా మంది ప్రజలకు నమ్మకం కలగక పోవడంతో చికెన్ తినడం మానేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చికెన్ షాపుల యజమానులు, పౌల్ట్రీ యజమానులు చికెన్ పైన కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఓ చికెన్ షాపు యజమాని 70 రూపాయలకు కిలో చికెన్‌ను ఆఫర్ చేయగా మరో షాపు యజమాని కిలో చికెన్ కొంటే 4 గుడ్లు ఉచితం అని బోర్డులు తలిగించారు. ఇదే కోణంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ చికెన్ షాపు యజమాని వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. నాలుగు కిలోల బరువు తూగే రెండు కోళ్లు కేవలం రూ.100 కే అమ్మాడు. కోళ్లకు కరోనావైరస్ ఉండదని, వాటిని తింటే ఎలాంటి అపాయం జరగదని చాటి చెప్పేందకే ఈ తరహా అమ్మకాలు చేపట్టినట్టు షాపు యజమాని తెలిపాడు. దీంతో వినియోగదారులు ఈ ఆఫర్ ఏదో బానే ఉందే. ఈ లెక్కన చూసుకుంటే కిలో చికెన్ కేవలం 25రూపాయలకు వస్తుందని షాపు ముందు క్యూ కట్టారు. ఇకపోతే ఈ కరోనావైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇప్పటి వరకూ రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

Related Posts