.కరోనాపై భయం, ఆందోళన వద్దు
.కరోనాపై భయం, ఆందోళన వద్దు.కరోనాపై భయం, ఆందోళన వద్దు
హైదరాబాద్, మార్చి 14
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ వైరస్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. అనంతరం కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామన్నారు సీఎం.ప్రతి వందేళ్లకు ఒకసారి ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్నారు సీఎం. దాదాపు వందేళ్ల క్రితం ఈ వైరస్ సోకి కోటి 4 లక్షల మంది చనిపోయారని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు. ఈ వైరస్ నియంత్రణకు కేంద్రంతో పాటు ఆయా రాష్ర్టాలు కూడా అప్రమత్తమయ్యాయి. అన్ని రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ర్టాల్లో సినిమా హాల్స్, స్కూల్స్ బంద్ చేశారు. పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నారు.దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజు 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు 2013-14లో 88 లక్షలు మంది ప్రయాణికులు వస్తే ప్రస్తుతం 2 కోట్ల 17 లక్షల మంది ప్రయాణికులు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 2013-14లో 23 వేల ప్రయాణికులు వస్తే ఇప్పుడు 57 వేల మంది వస్తున్నారు. నాడు 200లకు పైగా విమానాలు వచ్చేవి. ఇప్పుడు 500లకు పైగా విమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగిందనడానికి ఈ విషయం చెబుతున్నాను. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ప్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలింది. దీంతో ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మన దేశంలోని అనుమతించొద్దని కేంద్రం వీసాలు రద్దు చేసింది. ఈ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్ చేసి.. నెగిటివ్ అని తేలితేనే బయటకు పంపాలి అనేది కేంద్ర ప్రభుత్వం సూచన అని సీఎం తెలిపారు. ఈ దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాలు ఉన్నాయి. అయితే వచ్చే వారు ఏ దేశం నుంచి వస్తున్నారో కూడా తెలియడం లేదు. గత వారం రోజుల నుంచి అప్రమత్తంగా ఉన్నాం. 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉండి పరీక్షలు నిర్వహిస్తున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.