YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అన్నీ ఉన్నా.. అభివృద్ధి సున్నా.

అన్నీ ఉన్నా.. అభివృద్ధి సున్నా.

అన్నీ ఉన్నా.. అభివృద్ధి సున్నా..(పశ్చిమగోదావరి)
ఏలూరు, మార్చి 14 (న్యూస్ పల్స్): సిరుల పంట అయిన ఆక్వా రంగానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేస్తుంది. దాని ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖకు కేటాయించిన రూ.7.80కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేయలేదు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు చేసి నిధులు విడుదల చేసినా ఏ విధంగా ఖర్చు చేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కాలంగా మత్స్యశాఖ ద్వారా దాదాపుగా ఎలాంటి పథకాలు అమలు కాలేదు. రైతులకు ఏ మాత్రం సహాయం అందలేదు. కేటాయించిన నిధులు ఖర్చు చేయడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మొదటి నుంచి ఆక్వా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత అంతంతే అనే విమర్శలున్నాయి. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేసే పరిస్థితి లేకపోవటం చాలా దురదృష్టకరమని ఆ రంగంలో నిపుణులు చెబుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు అని చెప్పే పాలకులు, అధికారులు ఉన్న నిధులపై ఇప్పటి వరకు శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తుంది. పశ్చిమలో లక్షకు పైగా ఎకరాల్లో చేపల సాగు, వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. అయినా మౌలిక వసతులు సైతం ఎక్కడా కనిపించవు. రైతులే స్వయంగా ఎంతో శ్రమకోర్చి రహదారులు, విద్యుత్తు సౌకర్యం వంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సరైన ప్రయోగశాలలు, చేప, రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు లేవు. అత్యవసరంగా పట్టుబడి పట్టిన ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు లేవు. ఇలా ఎన్నో సమస్యలు జిల్లాలో ఆక్వారంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఉన్న నిధులు ఖర్చు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలివిప్లవం పథకం ద్వారా చేపల రవాణా వాహనాలు, మత్స్యకారులకు మోపెడ్‌లు రాయితీపై అందిస్తారు. ఐస్‌ ప్లాంట్‌లు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటుకు చేయూతనిస్తారు. మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేపల వేట సాగించే మత్స్యకారులకు బోట్లు, వలలు రాయితీపై అందిస్తారు. రొయ్యల సాగు చేసే రైతులకు ఒక హెక్టారుకి 50 శాతం రాయితీపై ఎనిమిది సెట్ల ఏరియేటర్‌లు అందించేవారు. మొత్తం యూనిట్‌ ఖరీదు రూ.1.60 లక్షలు అయితే దానిలో రైతు రూ.80 వేలు, మిగిలింది ప్రభుత్వం చెల్లించేది. ఈ ఏడాది కూడా అలా చేయాల్సి ఉంది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం ద్వారా చేపల మార్కెట్‌ భవనాలు నిర్మిస్తారు. సామాజిక భవనాలు, చేపలు ఆరబెట్టే ఫ్లాట్‌ఫారాలు నిర్మిస్తారు.ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రాలు అంటే నీటి రిజర్వాయర్లలో వేటాడిన చేపలను ఒకే చోట చేర్చే ప్రదేశాలు ఏర్పాటు చేస్తారు. ఇలా అనేక పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత మత్స్యశాఖపై ఉంది.

Related Posts