
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం యద్దేచ్చగా కొనసాగుతోందని ఆయన కన్నెర్రజేశారు. శనివారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. పోలీసులే టెరరైజ్ చేసే పరిస్ధితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు. నల్ల జీవోని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యంపైనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసు దాడులు వల్ల తలెత్తిన ఇబ్బందుల తాలుకు వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.
ప్రజలు ఛీ కొట్టి మొఖాన ఉమ్మేసే పరిస్థితి పోలీసులు తెచ్చుకోవద్దు
రాజ్యాంగ ఉల్లంఘనలకు పోలీసులు పాల్పడ్డారు. పోలీసు తీవ్రవాదాన్ని ఒక వ్యవస్థగా మార్చేశారు. దీంతో కొందరు మంచి చేసే పోలీసులు ఉన్నా వారినీ పనిచేయకుండా చేశారు. పోలీసు హింసను తట్టుకోలేక చాలా మంది లొంగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజలు ఛీ కొట్టి మొఖాన ఉమ్మేసే పరిస్థితి పోలీసులు తెచ్చుకోవద్దు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందో డీజీపీ చెప్పాలి. నియంతలను కాపాడటానికి పోలీసులు టెర్రరిజమా?. వివేకానంద హత్య వెనుక ఉంది ఇంటి దొంగలే అన్న సంగతి ప్రపంచమంతా తెలిసినా.. విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చి 151 నోటీసు ఇచ్చారు. కోర్టు తీర్పు అంతా చూసారు.మాచర్లలో స్కెచ్ వేస్తే తొలిసారి బతికి బయటపడింది మావాళ్ళే. తెనాలి ఘటనలో సీసీటీవీ కెమెరా ఉంది కాబట్టే వారు బయటపడ్డారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.