ఒకరు డిశ్చార్జి..మరొకరికి పాజిటివ్
హైద్రాబాద్, మార్చి 14
తెలంగాణలో కరోనా రెండో కేసు నమోదైంది.. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని.. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని సభలో కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని.. మరో ఇద్దరి శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని తెలిపారు.కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు చనిపోయారని.. చరిత్రలో కరోనాలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి అన్నారు. ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తాయన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు ఎవరొచ్చినా.. వాళ్లను 14 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారన్నారు. సాయంత్రం 6గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. కేబినెట్ భేటీకి వైద్యాధికారులను పిలిచామన్నారు సీఎం.తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసు సంగతి తెలసిందే. ఈ వైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన హైదరాబాద్ టెకీ డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా రావడంతో గాంధీ వైద్యులు అతడిని శుక్రవారం (మార్చి 13) డిశ్చార్జ్ చేశారు. అయితే.. 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహీంద్రాహిల్స్‌కు చెందిన టెకీ.. కరోనా లక్షణాలతో మార్చి 1న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి 9 రోజుల పాటు చికిత్స అందించారు. ఐదు రోజుల కిందటే అతడికి టెస్టు చేయగా కరోనా నెగటివ్‌గా వచ్చింది. స్పష్టత కోసం అతడి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. అతడు పూర్తిగా కోలుకోవడంతో 13 రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు.