YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

గోవిందుడు అందరివాడేలే...

గోవిందుడు అందరివాడేలే...

గోవిందుడు అందరివాడేలే...
*వాసనాత్‌ సర్వభూతానాం వసుత్వాత్‌ దేవయోనితః ...* 
సమస్త ప్రాణుల్లోనూ నివాసం ఉండడం వల్లా, దేవతలు ఆయనలో కొలువుదీరడం వల్లా - వాసుదేవ అన్న పేరొచ్చిందని వ్యాసభారతం చెబుతోంది.  మనిషి కోసం అవతరించిన దేవతలు చాలామందే ఉండవచ్చు. కానీ, కృష్ణుడు ప్రకృతి కోసమూ పుట్టాడు.  ఆ మమకారం కొద్దే వైకుంఠాన్ని వదిలిపెట్టి పచ్చని పల్లెకు విచ్చేశాడు. రేపల్లె పౌరసత్వం పుచ్చుకున్నాడు. ఆవుల్ని కాచాడు, లేగలతో ఆడుకున్నాడు. కొండలెక్కాడు, గుట్టలెక్కాడు.  ఆ వెన్నదొంగ మన్నుదొంగ కూడా! మట్టిని పరమాన్నంలా తినేస్తూ యశోదమ్మకు దొరికిపోయాడు. ‘అమ్మా మన్నుదినంగనే శిశువునో ఆకొంటినో’ అంటూ బుకాయించే ప్రయత్నమొకటి.  అమ్మకు తెలియవా ఆ దొంగాటలు. నోరుతెరవమంది.
ఆ...అనగానే అనంత ప్రకృతి!
ఓసారి కాళింది మడుగులోని నీళ్లు తాగి గోవులు చనిపోయాయి. కాళీయుడనే సర్పం ఆ జలాల్ని విషపూరితం చేసింది.  ‘నీళ్లంటే అమృతమే. పశువుల పొట్టలు నిండుతాయి. మనుషుల దప్పిక తీరుతుంది. చేపలూ కప్పలూ మడుగునే ఆశ్రయించి బతుకుతాయి. జలాన్ని కలుషితం చేయడం అంటే పంచమహా పాతకాలకు పాల్పడినట్టే’ అంటాడు కృష్ణుడు. తనే, మడుగులోకి దూకి...శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. వాసుకితో పాలసముద్రాన్ని మధించినట్టు కాళిందిని చిలికేశాడు. కాలుష్యపు జాడే లేకుండా శుభ్రం చేసేశాడు. పన్లోపనిగా కాళీయుడి అహాన్ని అణిచేశాడు. 
కృష్ణుడికి చెట్టూచేమలన్నా మహాఇష్టం. 
ఓసారి యశోదమ్మ బిడ్డ కాలు కదపకుండా రోకలికి కట్టేసింది. అల్లరి కృష్ణుడు గమ్మునుంటాడా, ఏకంగా రోటినే లాక్కుంటూ వెళ్లి తరాలనాటి మద్దిచెట్లకు మోక్షమిచ్చాడు. వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్నని గీతలో ప్రకటించాడు కూడా.కొండలంటే కూడా కొండంత ప్రేమ. పల్లె జనమంతా ఇంద్రుడికి పూజలు చేసి నైవేద్యాలు పెడతామంటే, కృష్ణుడు వద్దేవద్దన్నాడు. ‘ఎక్కడో ఉన్న ఇంద్రుడికెందుకు? మన కోసమే, మన పల్లె పక్కనే వెలసిన గోవర్ధనగిరికి పూజలు చేద్దాం పదండి! ఆ కొండ...గోవులకు గడ్డి ఇస్తుంది. పక్ష్యాదులకు నీడనిస్తుంది. మనకు పండ్లూ పూలూ ఇస్తుంది. ప్రాణాలు నిలిపే ఓషధుల్ని అందిస్తుంది.ఇంతకు మించిన వేలుపు ఇంకెక్కడ దొరుకుతుంది?’ - అని చెప్పాడు. ఎదురేముంది, అంతా బయల్దేరారు. పూజలు చేశారు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. కుంభవృష్టి కురిపించాడు.కృష్ణుడికి ఆ మాయలు తెలియవా? వేలితో కొండనెత్తి రేపల్లె జనానికంతా నీడనిచ్చాడు. అంతలోనే ఇంద్రుడు తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు. గోవులకూ గోపాలకులకూ గోపికలకూ అధిపతిగా కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం జరిపించాడు. మేని ఛాయ, మెడలోని చెంగల్వపూదండ, తలమీది పింఛం, మొలతాడుకు కట్టుకున్న కొమ్ముబూర... అన్నీ ప్రకృతి ప్రేమకు చిహ్నాలే. కృష్ణుడిని ప్రేమించడమంటే ప్రకృతినీ ప్రేమించడమే. కాదంటే, కన్నయ్య మెచ్చడు మరి...

వరకాల  మురళి మోహన్ సౌజన్యంతో .

Related Posts