*తిరుమల నైవేద్య వైభవం!*
ప్రపంచంలో ఎక్కడాకూడ తిరుమలలో జరిగినన్ని నివేదనలు జరుగవు. అన్ని ప్రసాదాలు శ్రేష్ఠమైన నెయ్యితోనే జరుగుతాయి. తిండి మెండయ్య, నైవేద్యప్రియుడు,తోమని పళ్లాలవాడు అయిన తిరుమలేశుడు తనకు ఎన్ని పండివంటలు సమర్పించినా, వాటిని మళ్ళీ భక్తులకే సమర్పిస్తూ వారినందరినీ సంతృప్తిపరస్తూ వున్నాడు.. మరి స్వామి వారి మహిమాన్వితమైన నైవేద్యాల వైభవం గురించిన ఈ వ్యాసం చదవడానకి రెండు నిమిషాలు కేటాయిద్దాం.)_
ప్రతీరోజూ తెల్లవారుజామున సుప్రభాతవేళలో తొట్టతొలుత శ్రీనివాసమూర్తికి *వెన్న, పాలు, చక్కెర* నివేదిస్తారు.. ద్వాపరయుగంలో ఉదయం లేచిన వెంటనే యశోదాదేవి వెన్నముద్దలు తినిపించేదిట.. ఆనాటి అలవాటేమో మరి.. ఇక ఆ తర్వాత శ్రీ శ్రీనివాసస్వామివారికి కొలువు (దర్బార్) జరుగుతుంది. బంగారు సింహాసనం పై ఛత్ర చామర మర్యాదలతో మహాదర్పంగా వేంచేసి ఉన్న శ్రీ వేంకట ప్రభువులకు రాజోచిత మర్యాదలన్నీ సమర్పించిన తర్వాత ఆనాటి తిథివార నక్షత్రాది పంచాంగ శ్రవణం, శ్రీవారి ఆలయ ఆదాయ వ్యయాలు విన్పించిన తర్వాత *నువ్వుల పిండి* (వేయించిన నువ్వులను బెల్లంతో కలిపి దంచిన పిండిని) సమర్పిస్తారు. శనిదేవునికి ప్రీతికరంగా ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు *నువ్వుల పిండిని* ఆరగిస్తారు. పిదప సహస్రనామార్చన జరుగుతుంది. ఆ తర్వాత *మొదటిగంట* అని పిలువబడే తొలి నైవేద్యంలో శ్రీస్వామివారికి ఎదురుగా *పులిహోర, పొంగలి, దధ్యోదనం, చక్కెరపొంగలి* మున్నగు అన్న ప్రసాదాలు, *లడ్లు, వడలు, అప్పాలు* వగైర పిండివంటలు కులశేఖరపడికి ఇవతలే వుంచుతారు. ఇంతలో ప్రధాన వంటదారుడు *“ఓడు”* అని పిలువబడే పగిలిన మట్టికుండలో *”మాత్రా”* అనబడే మాతృ దధ్యోదనాన్ని మాత్రం ఆనందనిలయంలోకి తీసుకెళ్ళి సమర్పిస్తాడు. చిక్కటి *మీగడ పెరుగన్నం వున్న ఓడు* తప్ప మిగిలి ప్రసాదాలన్నీ గడపకివతలే నివేదన చెయ్యబడతాయి. ఇక మధ్యాహ్నం అష్టోత్తర శతనామార్చన అయిన వెంటనే శ్రీస్వామి వారికి *రెండవగంట* అనబడే మధ్యాహ్నపు నైవేద్యానికి కూడా ఈ వంటశాల వంటలు సిద్ధంగా వుంటవి మరి. పైన పేర్కొన్న అన్నప్రసాదాలతో పాటు, *శుద్ధాన్నం,* ఇంకా భక్తులు మొక్కులుగా సమర్పించే *అన్న ప్రసాదాలు, సీరా, పాయసం, కేసరీబాత్, క్షీరాన్నం, కదంబం,* మున్నగు ప్రసాదాలను కూడా స్వామి వారు ఆరగించి భక్తులను ఆనందింప చేస్తారు..రెండవగంట అయినవెంటనే శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి (ఉత్సవ శ్రీనివాసమూర్తి) భక్తులకు కన్నులపండువు చేయడానికి నిత్య కల్యాణోత్సవానికై కల్యాణ మండపానికి వేంచేస్తారు. కల్యాణానంతరం శ్రీవారికి *లడ్లు, వడలు, అప్పాలు, దోసెలతోపాటు, చక్కెరపొంగలి, పులిహోర, పొంగలి, దధ్యోదనం* మున్నగు అన్న ప్రసాదాలను నివేదిస్తారు. ఆ తర్వాత శ్రీ మలయప్పస్వామి కొందరి ఆర్జిత సేవా భక్తుల కోరిక మేరకు వసంతోత్సవంలో పాల్గొని కనువిందు చేస్తారు.. ఆ వసంతోత్సవంలో కూడి శ్రీ స్వామివారు *దోసెలు అన్న ప్రసాదాలను* ఆరగించుతారు. ఆ వెంటనే అద్దాలమండపంలో జరిగే డోలోత్సవం లోను, సాయంత్రం జరిగే సహస్రదీపాలంకార సేవలోను శ్రీ స్వామి వారికి *పంచకజ్జాయం* అనే ప్రసాదం నివేదింప బడుతుంది. *చక్కెర, గసగసాలు, కలకండముక్కలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు, ఎండు కొబ్బరి కోరు అన్నీ కలిపి తయారుచేసిన పొడిలాంటి ప్రసాదమే ఈ పంచకజ్జాయం!* దీన్నికూడా వంటకాల పరిచారకులే సిద్ధంచేసి సమర్పిస్తారు..
ఇక సాయంత్రం సంధ్యాసమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తోమాల సేవ అనే పుష్పాలంకరణ సేవ ఏకాంతంగా జరుగుతుంది. వెంటనే *తోమాల దోసెపడి* అనే పెద్ద పెద్ద నెయ్యిదోసెలు, *మొళహార, కదంబం* మున్నగు అన్నప్రసాదాలు నివేదింపబడతవి. పిదప శ్రీ స్వామి వారికి మూడవ అర్చనగా అష్టోత్తర శతనామార్చన జరిగిన తర్వాత *మూడవగంట* అనబడే రాత్రి నైవేద్యం జరుగుతుంది. ఈ గంటలో కూడా *చక్కెర పొంగలి, పొంగళ్ళు, మొళహర, కదంబం* మున్నగు ప్రసాదాలను శ్రీనివాసుడు ఆరగిస్తాడు. ఇలా మూడుగంటలు అనబడే మూడు పూటలా నివేదనలే కాక చివరగా రాత్రిపూట *“తిరువీసం”* గంట అనే ప్రత్యేక నివేదనలో శ్రీనివాసునికి *చక్కెర పొంగలి* సమర్పిస్తారు. పిదప రాత్రి ఏకాంతసేవలో శ్రీ వేంకటేశ్వరునికి బాగా కాచి చల్లార్చిన *గోరువెచ్చని చక్కెర కలిపిన పాలు, పండ్లు పంచకజ్జాయంతో* పాటు *”మేవా”* అనబడే *పంచామృతం* లాంటి ప్రసాదం నివేదింపబడుతుంది. ఇలా ప్రతీరోజు ఇవేకాకుండా, ప్రతీ సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామికి జరిగే విశేష పూజలో కూడా *పెద్ద వడలు, లడ్లు, అన్నప్రసాదాలు* నివేదన చేస్తారు.
ప్రతీ బుధవారం ఉదయం బంగారువాకిలి వద్ద జరిగే సహస్రకలశాభిషేకంలో ప్రత్యేకంగా *క్షీరాన్నంతో* పాటు మిగిలిన అన్నప్రసాదాలు నివేదింపబడతాయి..
ఇక ప్రతీ గురువారం జరిగే తిరుప్పావడ అనే సేవలో సుమారు *420 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోరను* శ్రీస్వామి వారి మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్దరాశిగా అమర్చి నేరుగా నివేదిస్తారు. దీనితో పాటు ప్రత్యేకంగా చాటంత *పెద్ద జిలేబీలు,* చాటంత *పెద్ద మురుకులు* (తేనెతోల) కూడ తిరుప్పావడ సమయంలో శ్రీవారికి నివేదన చేస్తారు. ఇక శుక్రవారం నాడు శ్రీనివాసునికి *పోళీలు లేదా హోళీలు లేదా హోళిగలు అనే పూర్ణం భక్ష్యాలను, సుఖియలనే ఉండ్రాళ్ళను* నివేదించుతూ వున్నారు. ఇక ప్రతీ ఆదివారం నాడు *“ఆదివారం ప్రసాదం”* అనబడే *చలిపిండి* ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. ఈ చలిపిండినే *అమృతకలశం* అంటారు. పిదప దీన్ని గరుడాళ్వారుకు నివేదిస్తారు. ఇవిగాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మున్నగు పర్వదినాల్లో శ్రీస్వామి వారు *దోసెలు, శనగపప్పుతో తయారు చేసిన శుండలి (గుగ్గుళ్ళు)* ని ఆరగిస్తారు. ఇంతేగాక శ్రీవారికి *పెసరపప్పు పణ్ణారం, పానకాన్ని* కూడా నివేదిస్తారు. ఇక నెలరోజులపాటు జరిగే *ధనుర్మాస* వ్రత సమయంలో అన్నప్రసాదాలతో పాటు ప్రత్యేకంగా *బెల్లపుదోసె* ను ప్రియంగా ఆరగిస్తారడు ఆనందనిలయుడు. పైన పేర్కొన్న ప్రసాదాలే కాక కొన్ని విశేష పర్వదినాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి *పాయసాలను, కేసరీబాత్, శాకరీబాత్, బకాళాబాత్, మనోహరే* అనబడే విశేష వంటకాలను కూడా ఆరగిస్తారు. ఇంతేగాక, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, దీపావళి ఆస్థానం.. వంటి ఆస్థానలలోను, బ్రహ్మోత్సవ సమయంలో జరిగే ఉత్సవాల్లో, ఊరేగింపుల్లోను ఇంకా, పారువేట ఉత్సవాలలోను, శ్రీ స్వామివారికి విశేషంగా నివేదనలు సమర్పింపబడతాయి.. తిరుమల శ్రీవారు ఆరగించే ప్రాసాదాలన్నీ ప్రధాన వంటశాలలోనే తయారు చేస్తారు.. ఇక్కడే వాయువ్యమూలకు శ్రీ వేంకటేశుని తల్లిగా చెప్పబడే *వకుళమాత* ఒక వేదికపై అధిష్టించి వంటల తయారీని పర్వవేక్షిస్తున్నట్లుండే విగ్రహం వుంటుంది. ఆ శ్రీవేంకటేశ్వరుని మనసారా స్మరిస్తూ, శ్రీవారి ప్రసాదాలను మానసికంగా ఆస్వాదిస్తూ, ఆనందనిలయునికి జేజేలు పలుకుదాం.
ఏడుకొండలవాడా! వేంకట రమణా!!
గోవిందా! గోవిందా!! గోవిందా!!!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో