YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ రూట్ మర్చారా....

పవన్ రూట్ మర్చారా....

పవన్ రూట్ మర్చారా....
రాజమండ్రి, మార్చి 16, 
ఆరువసంతాలు పూర్తి చేసుకుని ఏడో ఏడాదిలోకి అడుగుపెట్టింది జనసేన పార్టీ. ఆవిర్భావం నుంచి అనేక ఎత్తుపల్లాలు ఈ ఆరేళ్లలో జనసేన చవిచూసింది. 2014 ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన జనసేన ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తుందనే పార్టీ పురుడు పోసుకున్న తొలినాళ్లలో అంతా భావించారు. ఒక పక్క టిడిపి పై అసంతృప్తి, అనుభవం లేని వైసిపి యుద్ధ క్షేత్రంలో జనసేన ముందు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన ను తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ ప్రజలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ – బిజెపిలపై ఆగ్రహంతో ఊగిపోతున్న రోజులవి. సినిమాల్లో హీరో గా మాస్ ఇమేజ్ తో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గం అండ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొత్త పార్టీపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేసి బలంగా వ్యవస్థీకృతం కావలిసిన పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపకుండా ముందు బిజెపి ఆతరువాత టిడిపి లకు మద్దతు ప్రకటించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏపీ కష్టాలు తొలగించే సత్తా ఉన్న వ్యక్తి అనే స్లోగన్ పైకి తెచ్చారు పవన్. పాతికేళ్ళపాటు రాజకీయాల్లో ఉంటా అని మోడీ తోనే దేశాభివృద్ధి, ఏపీ కి న్యాయం జరుగుతాయని విస్తృత ప్రచారం సాగించారు. కట్ చేస్తే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కానీ పవన్ కల్యాణ్ ఆశించిన న్యాయం వారి నుంచి ఎపి వాసులకు దక్కలేదు. ఆ తరువాత టిడిపి నుంచి కానీ బిజెపి నుంచి కానీ ఏ పదవిని కూడా జనసేనాని ఆశించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం ఆయన టిడిపి, బిజెపి లకు ఎదురు తిరిగారు. ఆ రెండు పార్టీలతోపాటు వైసిపి ఓటమి తన లక్ష్యం అంటూ గేర్ మార్చి యూ టర్న్ కొట్టారు పవన్ కల్యాణ్. కమ్యూనిస్ట్ లు, బీఎస్పీ లతో పొత్తు పెట్టుకుని భిన్నమైన వ్యూహంతో సాగారు. అయితే ఈ ప్రయత్నం 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయ్యింది. జనసేన కేవలం ఒక్క స్థానమే దక్కింది. ఆ ఎమ్యెల్యే కూడా ఆపార్టీలో కొనసాగుతున్నారో లేదో తనకే అర్ధం కావడం లేదని అధినేతే వాపోయేలా పరిస్థితి మారిపోయింది. వైసిపి అధికారం చేపట్టాక మరిన్ని కష్టాలు జనసేన ను వెంటాడాయి. పార్టీలో టికెట్లు పొంది ఓటమి పాలైనవారు వ్యూహకర్తలు జనసేనకు దూరం అయ్యారు. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ తో సహా పాలిట్ బ్యూరో బ్యాచ్ కూడా గుడ్ బై కొట్టేశారుఈ పరిణామాలు జనసేన క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం ధైర్యం వీడలేదు. ఉండేవారు వుండండి పోయేవారు పొండి అంటూ తన వెంట ఎవరు వున్నా లేకపోయినా పార్టీ కొనసాగిస్తా అని ప్రకటించేశారు పవన్. అంతే కాదు ఈ మధ్యలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఏ ఎన్నికలు లేని సమయంలోనే బిజెపి తో చేతులు కలిపి ఏపీ లో నడుస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక దెబ్బలు తగిలి తగిలి ఇప్పుడు రాటుదేలుతున్నారు పవన్ కల్యాణ్. పార్టీకి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదని సినిమాల్లో నటించకూడదని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రస్థానం మొదలు పెట్టారు పవన్. ఇలా సాగుతున్న జనసేన ప్రయాణం లో కొత్త పంథాను రూపొందించారు పవన్. ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను జనసేనాని అన్వేషిస్తున్నారు. ప్రజలు తనను వద్దనుకున్నా తాను వారు కావాలనే కోరుకుంటున్నా అంటూ ఆరవ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే జనసేన కొత్త రూట్ మ్యాప్ ఏమిటన్నది చెప్పేశారు జనసేనాని.పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. ఇప్పుడు పవన్ కల్యాణ్ సమాజానికి ప్రయోజనం కలిగించే అంశాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీ లోని నదీజలాల పరిరక్షణ కోసం మన నది అలాగే తెలుగుభాషోద్యమం కోసం మన నుడి అనే వినూత్న కార్యక్రమాన్ని జనసేన ప్రకటించింది. రాజమండ్రి గోదావరి తీరం నుంచి మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తునే స్పందనే లభించింది. తెలుగు భాషా పరిరక్షణకు జనసేన నడుం కట్టడం పై కూడా అందరి మన్ననలు అందుకుంది. రాజకీయాలు అంటే తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్కామ్ లకు పాల్పడటం కోసమే అన్న రీతిలో ప్రజల్లో అభిప్రాయం రోజు రోజుకు బలపడుతుంది. దానికి అనుగుణంగానే అధికార ప్రతిపక్షాల వ్యవహారం సాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పంథాలో సమాజానికి ఉపయోగపడే అంశాలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తే జనసేన ప్రయాణం వచ్చే రోజుల్లో సాఫీగా సాగవచ్చు. విమర్శలు, ఆరోపణలు కాదు పనికొచ్చే పనిచేద్దాం మార్పు కోసం అడుగులు వేద్దాం అనే రీతిలో జనసేన కొత్త ప్రస్థానం ఏ మేరకు విజయతీరాలు చేరుస్తుందో చూడాలి.

Related Posts