
సరోగసిలో వాట కోసం..మహిళా సంఘం ఆరాచకం
బెంగళూర్, మార్చి 16
ఆడదానికి ఆడదే శత్రువన్న నానుడిని నిజం చేసిందో లేడీ గ్యాంగ్. ఆర్థిక ఇబ్బందులతో ఎవరి బిడ్డనో మోసి కని ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్న సరోగసీ మదర్‌పై కన్నేసిన ఆడ ముఠా దారుణానికి పాల్పడింది. ఆమె కష్టంలో వాటా కావాలని బెదిరింపులకు దిగి చివరికి ఆమెని ఆస్పత్రి పాల్జేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సాటి మహిళ అని.. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా దారుణంగా కొట్టి పిండాన్ని చిదిమేసిన అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కేవలం డబ్బుల కోసం ఓ పిల్లలు పుట్టని తల్లి ఆశలను చిదిమేసి.. ఆర్థిక బాధల నుంచి బయటపడే గత్యంతరం లేక అమ్మతనాన్ని అరువిచ్చిన ఓ మహిళ కష్టాలను అవహేళన చేసిన ఆడ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా సంఘాల ముసుగులో బలవంతపు వసూళ్లు చేసేందుకు బెదిరింపులకు దిగిన ముఠా.. డబ్బులివ్వలేదని దారుణ మారణకాండకు పాల్పడడం కలకలం రేపింది. అరాచకంగా తయారైన లేడీ ముఠా అకృత్యాలపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు.. కడుపులో బిడ్డని కనేందుకు కమిషన్ అడిగిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బెంగళూరుకి చెందిన దంపతులకు పెళ్లై చాలా ఏళ్లయినా పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టే భాగ్యం లేదని బాధపడుతున్న మహిళ ఎలాగైనా తల్లిని కావాలంటూ వైద్యులను సంప్రదించింది. అందుకు వైద్యులు సరోగసీ విధానాన్ని సూచించారు. దంపతుల నుంచి జన్యువులను సేకరించి వేరొకరి కడుపులో బిడ్డను పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకోసం మరో మహిళను బేరం కుదిరింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సదరు మహిళ.. తన కడుపులో పిండాన్ని మోసి కని ఇచ్చేందుకు అంగీకరించింది. ఫెర్టిలిటీ సెంటర్‌లో నమోదు చేసుకున్న సరోగసీ మదర్ వారి సంరక్షణలోనే ఉంటోంది..బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిన సరోగసీ మదర్‌ను ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులే సౌత్ఈస్ట్ బెంగళూరులోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఆశ్రయం కల్పించారు. ఆమె సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు కేర్‌టేకర్లను నియమించారు. ఆమెకి క్రమం తప్పకుండా ఆహారం, వైద్య పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్న విషయం ఓ డీ గ్యాంగ్‌కి తెలిసింది. డబ్బుల కోసం బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిందని తెలుసుకుని మహిళా సంఘాల ముసుగులో సరోగసీ మదర్‌ని బెదిరించడం మొదలుపెట్టింది. బిడ్డని కడుపులో మోసి ప్రసవించి ఇచ్చినందుకు దంపతులు ఇస్తామన్న డబ్బులో వాటా కావాలంటూ డిమాండ్ చేసింది. ఓ సారి తాను ఉంటున్న నివాసానికి వచ్చి బెదిరించి వెళ్లింది.మదర్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమెపై కక్షగట్టిన ఆడ ముఠా దారుణానికి పాల్పడింది. గర్భిణిపై మూకుమ్మడిగా దాడి చేసింది. ఆమె కేర్‌టేకర్లపై కూడా దాడికి పాల్పడ్డారు ముఠా సభ్యులు. సరోగసీ మదర్ కడుపులో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కేర్‌టేకర్లు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు. డబ్బుల కోసం కడుపులో బిడ్డను చనిపోయేందుకు కారణమైన లేడీ గ్యాంగ్‌పై సరోగసీ మదర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.కడుపులో బిడ్డ చనిపోయేందుకు కారణమైన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన స్వాతి మహిళా సంఘటన సభ్యులుగా చెప్పుకుంటున్న పూజ, మంజునాథ్, ప్రేమ, రీటా, ఆశ, ప్రమీలను అరెస్టు చేశారు. మహిళా సంఘం ముసుగులో కమిషన్ల కోసం ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. వాటా ఇవ్వనన్నందుకే గర్భిణిపై దారుణంగా దాడి చేసి గర్భస్రావానికి కారణమయ్యారన్న అభియోగాలు నమోదు చేశారు.