YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమల్‌నాథ్‌ను కాపాడిన కరోనా

కమల్‌నాథ్‌ను కాపాడిన కరోనా

కమల్‌నాథ్‌ను కాపాడిన కరోనా
భోపాల్, మార్చి 16
మధ్యప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈనెల 26వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు... స్పీకర్ తెలిపారు. సభను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేశారు. దీంతో కమల్‌నాథ్ సర్కార్‌కు కాస్త ఊరట దొరికినట్లైంది. మరో పదిరోజుల పాటు... కమల్ నాథ్ సర్కార్‌ బలపరీక్షకు బ్రేక్ పడినట్లైంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అన్ని అధికారిక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు సైతం ముగించేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా ఈనెల 20వరకు జరగాల్సిన అసెంబ్లీ ఇవాల్టితోనే ముగించేసింది. మొత్తం మీద కరోనా వైరస్ కారణంగా కమల్ సర్కార్‌కు కాస్త ఉపశమనం లభించినట్లైంది.ఇవాళ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాలని ఎంపీ గవర్నర్ టాండన్ ప్రకటించారు. మరోవైపు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. గవర్నర్‌ను లాల్జీ టాండన్‌ను కలిసిన ఆయన.. స్పీకర్‌ నిర్ణయిస్తే విశ్వాసపరీక్షకు తాను ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. కానీ అనూహ్యంగా బలపరీక్షకు బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మరోవైపు మధ్యప్రదేశ్ సంక్షోభం నేపథ్యంలో గత ఐదు రోజులుగా హర్యానలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున వారంతా భోపాల్‌ విమానాశ్రయానికి చేరుకోగా.. రాష్ట్ర బీజేపీ యంత్రాంగం ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది.2018 లో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీనియర్ నేత, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు, యువనేత, రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. చివరికి సింధియా పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే మోదీని కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సింధియాకు మద్దతుగా దాదాపు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. అయితే రెండు రోజుల క్రితం గవర్నర్ టాండన్‌ను కలిసి కమల్ నాథ్ బలపరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు.

Related Posts