YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నిర్భయ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

నిర్భయ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

నిర్భయ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ, మార్చి 16 
 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్‌ సింగ్‌ తాజా విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి క్యూరేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరిన అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం మిగల్లేదు. నీకు క్షమాభిక్ష అడిగే అవకాశం లభించింది. అది తిరస్కరించబడింది. వారెంట్లు జారీ అయ్యాయి. క్యూరేటివ్‌ పిటిషన్‌ కూడా కొట్టివేశాం. ఇంకా ఏం మిగిలి ఉంది’’అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉరిశిక్షను నిలుపుదల చేసే అవకాశాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా తన పట్ల నేరపూరిత కుట్ర పన్నారంటూ తన మాజీ లాయర్‌ వృందా గ్రోవర్‌పై చర్యలు తీసుకోవాలన్న ముఖేశ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. రివ్యూ పిటిషన్‌ కొట్టివేసిన తర్వాత తేదీ నుంచి మూడేళ్లలోపు మరోసారి పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంటుందని తన లాయర్‌ ఎంఎల్‌ శర్మ ద్వారా ముఖేశ్‌ గత వారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు ఉన్న అన్ని హక్కులను పునరుద్ధరించాలని, మరోసారి క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు, క్షమాభిక్ష అడిగేందుకు జూలై 2021 నాటి వరకు అనుమతినివ్వాలని కోరాడు. ‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్‌తో పాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’’ అని ముఖేష్‌ తన పిటిషన్‌లో ఆరోపణలు గుప్పించాడు. కాగా నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్‌వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మరణశిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది

Related Posts