YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గంటా లోపాయికారి ఒప్పందం...

గంటా లోపాయికారి ఒప్పందం...

 గంటా లోపాయికారి ఒప్పందం...
విశాఖపట్టణం, మార్చి 17
గంటా శ్రీనివాసరావు పక్కా వాస్తవవాదిగా ఉంటారు. ఆయనది రెండు దశాబ్దాల రాజకీయ జీవితం. ఇప్పటికి మూడు పార్టీలు, నాలుగైదు నియోజక‌వర్గాలు మారిన చరిత్ర ఉంది. అయినా కూడా ఎక్కడా ఓడకుండా గెలుస్తున్న రికార్డ్ కూడా ఆయన సొంతం. అటువంటి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆయన వెంట ఉన్న కీలకమైన నేత. ఆ తరువాత అదే పార్టీ కోటాలో మంత్రి పదవిని కూడా కాంగ్రెస్ నుంచి సంపాదించుకున్నారు. ఇక విభజన తరువాత ఆయన తిరిగి టీడీపీలో చేరారు. 2019 ఓటమి అనంతరం ఆయన వైసీపీ వైపు మొదట చూశారు, ఫిరాయింపుల చట్టం అడ్డుకావడంతో సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఓ దశలో బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారమూ ఉంది.గంటా శ్రీనివాసరావుకు అన్న చిరంజీవి ఎంత సన్నిహితుడో, తమ్ముడు పవన్ తో అంత దూరం ఉంది. అయితే అది గంటా నుంచి పెరిగింది కాదు, పవన్ ఎందుకో ఆయనను దూరం పెట్టారని అంటారు. ఆయన వల్లనే తన అన్న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేశారన్న అనుమానాలతో గంటా మీద ఎప్పటికపుడు పవన్ విరుచుకుపడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే గంటా ఇపుడు జనసేన, బీజేపీ కూటమి పట్ల ఆసక్తిగా ఉన్నారని విశాఖ జిల్లాలో టాక్ నడుస్తోంది. ఆయన భవిష్యత్తు రాజకీయాలు దృష్టిలో ఉంచుకుని వారికి తన సొంత నియోజకవర్గం ఉత్తరంలో చేయూతను ఇవ్వాలనుకుంటున్నారుట.తన సొంత సీటు ఉత్తరంలో బీజేపీ, జనసేన కూటమితో గంటా శ్రీనివాసరావు లోపాయికారీ అవగాహనకు వచ్చారని టాక్ నడుస్తోంది. ఇక్కడ మొత్తం పదిహేడు వార్డులు ఉన్నాయి. ఇందులో బీజెపీకి, జనసేనలకు చెరి రెండు సీట్లు ఇవ్వడం ద్వారా వారిని మచ్చిక చేసుకుని వారి మద్దతుతో మిగిలిన సీట్లు గెలుచుకోవాలని గంటా శ్రీనివాసరావు చూస్తున్నారుట. ఆ విధంగా ఏ టీడీపీ ఎమ్మెల్యే సాధించలేని విధంగా అత్యధిక కార్పోరేటర్లను గెలుచుకుని రేపటి మేయర్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవతారం ఎత్తాలన్నది గంటా వ్యూహమని అంటున్నారు.గంటా శ్రీనివాసరావు ఈ రకమైన వ్యూహాన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించడం ద్వారా అటు బీజేపీకి, ఇటు జనసేనలకు సానుకూల సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. ఏపీలో ఎటూ టీడీపీ బాగా బలహీనంగా ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురొడ్డి నిలిచేది జనసేన, బీజేపీ కూటమి మాత్రమేనని గంటా శ్రీనివాసరావు నమ్ముతున్నట్లుగా ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినా తాను ఫోర్ ఫ్రంట్ లో ఉండేలా గంటా ఇప్పటినుంచే కధ నడిపిస్తున్నారని అంటున్నారు. మరో వైపు కొద్దిగా బలం ఉన్నా కూడా గెలిచే అవకాశం లేని బీజెపీ, జనసేన కూటమికి జీవీఎంసీలో నలుగురు కార్పోరేటర్లు అయినా దక్కుతాయనుకుంటే అది వారికి కూడా లాభమే. అలా ఉభయతారకమంత్రంగా ఈ లోపాయికారీ అవగాహన ఉందని ప్రచారం సాగుతోంది.

Related Posts