YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*సంభవామి యుగే యుగే...* 

*సంభవామి యుగే యుగే...* 

*సంభవామి యుగే యుగే...* 
భాగవతబాలుడు...
అమాయకుడు, సున్నిత స్వభావుడు, గోపీజనవల్లభుడు. 
అదే కృష్ణుడు మహాభారత ఘట్టానికి వచ్చేసరికి...
రాజకీయవేత్త, మేధావి, వ్యూహకర్త, దార్శనికుడు. 
కృష్ణుడేం చక్రవర్తి కాదు. ఓ చిన్న రాజ్యానికి నాయకుడు. అయితేనేం, మహామహా చక్రవర్తులు సైతం కృష్ణుడికి పాదాభివందనాలు చేసేవారు. ఆ గౌరవం అధికారంతో సొంతం కాలేదు, మేధస్సుతో వచ్చింది. ఎక్కడ నెగ్గాలన్నదే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా అతడికి తెలుసు.  కాలయవనుడనే రాక్షసుడు అక్షౌహిణుల కొద్దీ సైన్యంతో యుద్ధానికొచ్చినా...కృష్ణుడు నిరాయుధుడై ఎదురు నిలబడ్డాడు. యవనుడు తరుముకొస్తుంటే...పరిగెత్తుకెళ్లాడు. కొండలు దాటి, కోనలు దాటి పాడుబడిన గుహలోకెళ్లాడు. ‘పిరికి కృష్ణుడు...’ అని ఎగతాళి చేసుకుంటూ గుహలో కాలుపెట్టాడా రాక్షసుడు. చిమ్మచీకట్లో...గాఢనిద్రలో ఉన్న వృద్ధుడిని చూసి కృష్ణుడేనని భ్రమించాడు. తట్టిలేపి ఆ తాపసి ఆగ్రహానికి గురై...బూడిదైపోయాడు. ఆ నేత్రాగ్ని ముచికుంద మహర్షిది. అదీ కృష్ణుడి వ్యూహరచనా నైపుణ్యం. కృష్ణుడు మంచిని కోరుకున్నాడు. మంచివైపు నిలబడ్డాడు. పాండవ పక్షపాత అంతరార్థమూ అదే! పాండురాజు మరణం తర్వాత....ధృతరాష్టుడి కొలువులో వివక్షకు గురవుతున్న మేనత్త పిల్లలకు ఉద్ధవుడి ద్వారా ‘నేనున్నా...’ అని సందేశం పంపాడు. అప్పటి నుంచి మహాప్రస్థానం దాకా - పాండవులకు కృష్ణుడే బంధువూ సఖుడూ గురువూ...సర్వస్వమూ! అంతిమంగా ధర్మం గెలవాలంటే, ముందు నుంచీ ధర్మబద్ధుల్ని కాపాడుకోవాలి. అందుకే, ‘అన్నా...’ అని పిలవగానే, పరుగుపరుగున వెళ్లి ద్రౌపదికి వస్త్రాలిచ్చాడు. ‘బావా...యుద్ధం చేయలేను’ అని అర్జునుడు విల్లంబులు జారవిడవగానే కర్తవ్యోపదేశం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామం దాకా శిశుపాలుడూ జరాసంధుడూ బతికుంటే...పాండవుల విజయావకాశాలు దెబ్బతింటాయని ముందే వూహించి ఆ ఇద్దరి అడ్డూ తొలగించాడు. దీని ద్వారా కౌరవులకూ ఓ పరోక్ష సంకేతం పంపాడు. కర్ణుడి బలాన్ని పరిమితం చేసి అర్జునుడిని శక్తిమంతుడిని చేశాడు. దుర్యోధనుడి బలహీనతను చేరవేసి భీముడికి మనోబలాన్నిచ్చాడు. భీష్ముడిని నిరోధించడానికి శిఖండిని రంగంలోకి దించాడు. ద్రోణుడిని నిలువరించడానికి ధర్మరాజుకో ధర్మ సూక్ష్మం బోధించాడు.అంతిమంగా పాండవులు గెలిచారు.  ధర్మసంస్థాపన జరిగింది. కృష్ణుడి లక్ష్యం నెరవేరింది. మానవజాతికి ఓ మహత్తర సందేశం అందింది

*పరిత్రాణాయ సాధూనాం* 
*వినాశాయచ దుష్కృతాం* 
*ధర్మసంస్థాపనార్థాయ* 
*సంభవామి యుగే యుగే!*  

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts