ఆగని కడుపుకోతలు
మహబూబ్ నగర్, మార్చి 17
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ శస్త్ర చికిత్సల ద్వారానే కాన్పులు చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. కొంచెం నొప్పులొస్తుండగానే భయంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్న కుటుంబాల బలహీనతే ఆసరాగా వైద్యులు కడుపుకోత పెడుతున్నారు. సాధారణ కాన్పు సులువుగా అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కాసుల వేటలో మునిగి తేలుతున్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తును కించిత్తు దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి తల్లులకు అసలు ప్రసవ వేదనే తెలియకుండా పోతోంది. నవమాసాలు మోసిన తల్లి నొప్పులు భరించైనా తన బిడ్డకు పురుడు పోస్తుందనేది పెద్దల మాట. వైద్యులు ఆ అవకాశమే లేకుండా ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకు పురిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. వైద్యుల సలహా పాటించకుంటే ఏం ప్రమాదం పొంచి ఉందోనన్న భయం బాధిత కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చే మత్తు మందు మున్ముందు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జిల్లాలో 2019ఏప్రిల్‌నుంచి 2020ఫిబ్రవరి 29వరకు 15,608 మంది గర్భిణులువివిధ ఆస్పత్రుల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఈ కాన్పులు జరుగుతున్న తీరు.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపార ధోరణి విమర్శలకు తావిస్తోంది. శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. రోజురోజుకూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ కాన్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే ‘కోత’గా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకుని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంత మేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మా త్రం దాదాపు 80శాతానికి పైగా సిజేరియన్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక పోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారీతిన సిజేరియన్లు జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. జిల్లాలోని చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాపారమే ధ్యేయంగా ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్‌లో కాసుల ప్రసూతి హవా సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే తల్లి, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆయా కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుంది. జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలకు ఆర్థికంగా భారమవుతోంది. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పునకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతోంది. ఇలా జిల్లాలో ప్రైవేట్‌లో అయిన 4,989 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా రూ.149కోట్ల ఆదాయం వస్తుంది. సర్కార్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు పైగా వారే రూ.12వేలు చెల్లిచడంతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు, బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలుంటేనే సిజేరియన్ చేయించాలి. దీనిపై సరైన అవగాహన లేని ప్రజలు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు.