అమీర్ పేటలో షట్ డౌన్
హైద్రాబాద్, మార్చి 18
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, మైత్రీవనంపై కరోనావైరస్ (కోవిడ్- 19).. పంజా విసిరింది. కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 850 హాస్టళ్లు, ఐటీ కోచింగ్ సెంటర్లను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించింది. ఈ మేరకు ఆయా హాస్టళ్లు, శిక్షణా సంస్థల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను కాదని ఎవరైనా నిర్వాహకులు కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో అక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లలో వివిధ కోర్సులు నేర్చుకుంటుంటారు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులతో అమీర్‌పేట్ ప్రాంతం కిలకిటలాడుతూ రద్దీగా ఉంటుంది. వీరిపై ఆధారపడి ఎన్నో హస్టళ్లు కూడా పుట్టగొడుల్లా అక్కడ వెలిశాయి. అయితే కరోనా ప్రభావంతో కొన్ని వారాల పాటు అమీర్‌పేట్, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు బోసిపోనున్నాయి కేవలం 24 గంటల గడువు ఇస్తూ అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 1000కి పైగా హాస్టళ్లను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నిర్వాహకులతో అత్యవసర సమావేశాలు పెట్టి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య అమీర్‌పేట్‌లోని బాపూనగర్, ఎస్‌ఆర్‌టీ, ఎస్‌ఆర్‌నగర్ ఎస్‌ఆర్‌టీ, గురుమూర్తినగర్, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, శివబాగ్‌లలో హాస్టళ్ల నిర్వాహకులతో అమీర్‌పేట్ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డిప్యూటీ కమిషనర్ గీతారాధిక, ఏఎంవోహెచ్ డాక్టర్ బార్గవ నారాయణలు సమావేశమై మూసివేతకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తొలుత హాస్టల్ నిర్వాహకులు కొంత ఆందోళన చెందినా, అధికారుల నుంచి చక్కటి వివరణలతో కూడిన ఆదేశాలు అందడంతో వారు వ్యాపారం కంటే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారు కూడా యంత్రాంగానికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే గురుమూర్తినగర్‌కు చెందిన కొందరు వ్యాపార్మాతక ధోరణితో వ్యవహరిస్తూ అధికారులతో కొంత సమయం ఇవ్వాలని వారించినా.. అధికారుల నుంచి హెచ్చరికల స్థాయిలో సమాధానాలు రావడంతో వారు కూడా చివరకు సమ్మతించారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులెవరైనా హాస్టళ్లలో ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని కార్పొరేటర్ శేషుకుమారి, డిప్యూటీ కమిషనర్ గీతారాధికలు తెలిపారు. ఈనెల 31వరకు నిరవధికంగా హాస్టళ్లను మూసివేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వాహకులు నడుచుకోవాల్సిందేనని చెబుతూ ఇందుకు 24 గంటల వ్యవధిని విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన హాస్టళ్లను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.