YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్ఐ నిర్బంధించిన గ్రామస్థులు

ఎస్ఐ నిర్బంధించిన గ్రామస్థులు

ఎస్ఐ నిర్బంధించిన గ్రామస్థులు
నెల్లూరు, మార్చి 18,
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం గ్రామస్థులు ఎస్సై హుసేన్ బాషాను మూడు గంటలపాటు గ్రామంలో నిర్బంధించారు. ఆయన సిలికా వ్యాపారులతో కుమ్మక్కై గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు.  చిల్లకూర మండలంలోని చింతవరం సమీపంలో ఉన్న సిలికా గనుల నుంచి ఖనిజాన్ని సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి లారీల ద్వారా తరలిస్తున్నారు. గ్రామం మీదుగా సిలికా లారీలు అధికవేగంతో రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రెండు లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. సాయంత్రం దాకా వాటిని వదలకపోవడంతో సంబంధిత ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్పార్టీ పోలీసులతో కలిసి గ్రామానికి చేరుకున్న ఎస్సై మహిళలు, వృద్ధులు, చిన్నారులు అని చూడకుండా విచక్షణారహితంగా లాఠీలతో గాయపరిచారు. అప్పటివరకు శాంతియుతంగా ఆందోళనకు దిగిన గ్రామస్థులు ఎస్సై తీరుతో భయకంపితులయ్యారు. గ్రామమంతా ఏకతాటిపై నిలిచి ఎస్సైను దాదాపు మూడు గంటలపాటు నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వ్యాపారులకే వత్తాసు పలుకుతూ ప్రజలను పట్టించుకోరా అంటూ ఆరోపించారు. ఎస్పీ, డీఎస్పీ గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఉండే పల్లెలో పోలీసులు చిచ్చుపెట్టారని విమర్శించారు. బుధవారం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ సిలికా లారీలను అనుమతించబోమని గ్రామస్థులు హెచ్చరించారు. ప్రజాభీష్టాన్ని వ్యతిరేకిస్తే తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థుల తీరుతో భయపడిన ఎస్సై వారికి శాంతియుతంగా సమాధానం చెప్పారు. ఈనెల 20న ఫ్యాక్టరీ ప్రతినిధులను పిలిపించి గ్రామస్థుల సమక్షంలో సమస్యకు పరిష్కారం చూపుతామని తెలియజేయడంతో శాంతించారు.

Related Posts