Highlights
- 24 నుండి 26వ తేదీ వరకు వేడుకలు
- భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు
- మరింత ఆహ్లాదకర వాతావరణం
- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాలు
తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది.మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుతిలోని టిటిడి పరిపాలన భవనంలో మీటింగ్‌హాల్ నందు సోమవారం ఉదయం ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిచారు. తిరుమల రింగ్‌రోడ్లకు ఇరువైపుల, ప్రధాన కూడళ్లలోపూల మొక్కలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మికతకు భంగం కలుగకుండా శబ్దంరాని ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో పచ్చదనాన్ని పెంపొందించేెందుకు, మొక్కలను కాపాడుటకు డ్రిప్ పైపుల ద్వారా నీటిని పంపేందుకు అటవీ విభాగం అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.దాంతోపాటుగా కాటేజీలు, అతిధి గృహాల నిర్వాహణలో క్రమం తప్పకుండా పరిశీలించి ఫ్లోరింగ్, ట్యాప్స్, పెయింటింగ్ మరమ్మత్తులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులు టిటిడిలో తమకు నచ్చిన విభాగాలలో సేవలందించేందుకు రూపొందిస్తున్న ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఏప్రిల్ 10వ తేది లోపల పూర్తి చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఎఫ్‌ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజీ, సిఇ శ్రీ చంవ్రశేఖర్‌రెడ్డి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.