కరోనా వైరస్ పై పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, మార్చి 18,
కరోనా వైరస్ వ్యాప్తి కన్నా దానిపై వచ్చే పుకార్లు మాత్రం వెంటనే వైరలవుతున్నాయి. ఎవరు పడితే వారు.. ఏది తోస్తే అది కరోనా వైరస్ విషయాలు పంపుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. వారు పంపించే విషయాలన్నీ విరుద్ధమైనా తెలియనితనం.. అవగాహన లేమితో ఆ వార్తలను వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దాని దెబ్బకు ప్రజలు భయాందోళన చెంది కంగారు పడే అవకాశం ఉంది. దీంతో పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయి. ఆ విధంగా పుకార్లు తప్పుడు వార్తలు చేసే వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఆ వార్తలను కట్టడి చేయడానికి పోలీసులతో కలిసి పని చేస్తున్నాయి. ఈ సందర్భంగా పుకార్లు సృష్టించే వారు వాటిని షేర్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో చాలామందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డయల్ 100కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. నమోదైన కొన్ని కేసులు ఇలా ఉన్నాయి. - ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు అంటూ తిరుపతిలో ఇటీవల ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ హడావిడి చేయడంతో అతడిపై పోలీస్ కేసు నమోదైంది.- నెల్లూరులో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ ఐసోలేషన్ వార్డ్ నుంచి పారిపోయాడని ఓ ఫేక్ న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో పెట్టిన యువకుడు ఇప్పుడు జైలు పాలయ్యాడు.- కరోనా వైరస్ మనలాంటి ఉష్ణ దేశాల్లో బతకదు మనకేం భయం లేదంటూ ఓ డాక్టర్ వాట్సప్ గ్రూపుల్లో వీడియో షేర్ చేశాడు. అతడిపై పోలీసులు చర్యలు తీసుకున్నాడు. - పశ్చిమబెంగాల్ లో మరీ దారుణం. కరోనా నివారణకు బీజేపీ నాయకుడు నారాయణ్ చటర్జీ ఉత్తర కోల్ కతాలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి గోమూత్రం తాగాలని చెప్పాడు. గోమూత్రం తాగితే కరోనా రాదని చెప్పి ఆయన తాగాడు.. ఇతరులకు తాగించాడు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు అతడు మూడు కేసుల్లో బుక్కై జైలు పాలయ్యాడు.ఈ విధంగా చిత్ర విచిత్రంగా కరోనాపై వార్తలు వస్తున్నాయి. కరోనా కేసులు ఆస్పత్రుల కంటే పోలీస్ స్టేషన్లలో ఎక్కువగా నమోదవుతుండడం విషయం. యూట్యూబ్ వాట్సాప్ వెబ్ సైట్స్ ఫేసు బుక్ వంటి సోషల్ మీడియాలో కరోనా పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వార్తలపై ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాయి. హోమియో మందులతో కరోనా నయమవుతుందని ప్రచారం చేసే వారి పై కూడా కేసులు పెట్టాలని నిర్ణయించారంట. సో మీరు కరోనా పై ఎలాంటి వార్తలు ప్రచారం చేయకుండా.. స్వీయ నియంత్రణ పాటించండి. సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం.. కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిది.