కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, మార్చి 18
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా వైరస్ లేదని.. విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వాళ్ల ద్వారా ఈ వైరస్ మనదేశంతో పాటు రాష్ట్రంలోకి ప్రవేశించిందని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో మంత్రి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.'రాష్ట్రంలో వైరస్ విజృంభించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. వైరస్ సోకిన వారితో పాటు వ్యాధి సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. మనం శుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్లు మిగతా వాళ్లకు దూరంగా ఉండాలి. ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజలు కొంతకాలం పాటు కొన్ని పనులను వాయిదా వేసుకోవాలని' మంత్రి సూచించారు.