కరీంనగర్ లో ఫుల్ అటెన్షన్
కరీంనగర్, మార్చి 19
ఇండోనేషియా నుంచి వచ్చిన కరోనా పేషెంట్లు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్టుగా గుర్తించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఆ పేషెంట్, ఆయనతో వచ్చినవారు బస చేసిన, తిరిగిన ప్రాంతాలన్నింటినీ బుధవారం రాత్రి నుంచి షట్ డౌన్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ మూడు కిలోమీటర్ల ప్రాంతంలో జనాలెవరూ ఇండ్లలోంచి బయటికి రావొద్దని ఆదేశించారు. గురువారం ఉదయం నుంచే వంద మెడికల్ టీమ్లతో ఇంటింటికీ తిరిగి పరిశీలిస్తామని, ప్రజలంతా సహకరించాలని ప్రకటించారు. ఇండోనేషియా నుంచి వచ్చినవారు ఎక్కడెక్కడ తిరిగారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారని, అనుమానితులు ఉంటే టెస్టులు చేస్తారని తెలిపారు. ఏ ఒక్కరు టెస్టులు చేయించుకోకపోయినా అమిత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇండోనేషియా కరోనా పేషెంట్లు కరీంనగర్లో తిరిగినట్టుగా గుర్తించడంతో మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి, మేయర్ సునీల్రావు, వైద్యాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశలోనే నివారించడం సులభమని, కరోనా పట్ల ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన 10 మందితోపాటు మరో ఇద్దరిని గాంధీ హాస్పిటల్కు తరలించామని చెప్పారు. వారు బస చేసిన చోటు, తిరిగిన ప్రాంతాలను గుర్తించి వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టామని తెలిపారు. కరీంనగర్లో వారు బసచేసిన ప్రాంతం నుంచి చుట్టూ మూడు కిలోమీటర్ల ప్రాంతంలో ఇంటింటికీ సర్వే కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశలోనే నివారించడం సులభమని, అందుకు ప్రజలంతా సహకరించి జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వ్యాధి తీవ్రతను ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ఎక్కువ రద్దీ ఉండే మార్కెట్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలకు వెళ్లొద్దని సూచించారు. మన బిడ్డల భవిష్యత్తు దృష్యా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.ఇండోనేషియాకు చెందిన పది మంది 14న ట్రైన్ లో ఢిల్లీ నుంచి రామగుండం వరకు వచ్చారని.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్ కు వచ్చారని కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. వారు కరీంనగర్లో ఎంత మందిని కలిశారన్నది ఆరా తీస్తున్నామని చెప్పారు. కరీంనగర్ ప్రజలంతా ఇండ్లకే పరిమితమైతే మంచిదని సూచించారు. మెడికల్ టీమ్లు టెస్టులు చేసి.. ఎలాంటి లక్షణాలున్నా నమోదు చేసుకుంటాయని, ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని స్పష్టం చేశారు. గురువారం టెన్త్ స్టూడెంట్లు తప్ప ఎవరూ బయటికి రాకూడదన్నారు. పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లను వాయిదా వేసుకోవాలని సూచించారు. జనం నిత్యావసరాల కోసం మాత్రమే బయటికి రావాలన్నారు. కరీంనగర్లోని పలు హాస్పిటళ్లలో ఐసోలేషన్ కోసం బెడ్లను సిద్ధం చేశామని తెలిపారు.