ఐపీఎల్ రద్దు తో 3,900 కోట్ల నష్టం
ముంబై, మార్చి 19,
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేసింది. కానీ.. వారం వ్యవధిలోనే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరగడంతో ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ రద్దయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అక్షరాలా.. రూ. 3,869.5 కోట్లు నష్టపోనుందని బిజినెస్ టుడే అంచనా వేసింది. బీసీసీఐ నష్టపోనున్న రూ. 3,869.5 కోట్లలో ముప్పావు వంతు పైగా అంటే..? రూ. 3.269.5 కోట్లు బ్రాడ్‌కాస్ట్, స్ట్రీమింగ్ రెవెన్యూకాగా.. మిగిలిన రూ. 200 కోట్లు సెంట్రల్ స్పాన్సర్‌షిప్, రూ. 400 కోట్లు టైటిల్ స్పాన్సర్‌షిప్ రూపంలో దక్కనున్న డబ్బు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకూ ఇంతటి సంకట స్థితిని బీసీసీఐ ఎప్పుడూ ఎదుర్కోలేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఏటా రెవెన్యూని డబుల్ చేసుకుంటూ వచ్చిన బీసీసీఐకి ఇది ఊహించని పరిణామమే.బీసీసీఐకి ఐపీఎల్ రూపంలో ఏటా రూ. వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నా.. ఇటీవల ఐపీఎల్ టైటిల్ విజేతకి అందించే ప్రైజ్‌మనీలో సగానికి సగం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది వరకూ టైటిల్ విజేతకి రూ. 20 కోట్లు ప్రైజ్‌మనీ రూపంలో అందజేస్తుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ విజేతకి రూ. 10 కోట్లు.. రన్నరప్‌కి రూ. 6.25 కోట్లు ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కి రూ. 12.5 కోట్లు దక్కింది. ఇక క్వాలిఫయర్స్‌లో ఓడిన రెండు జట్లకీ రూ. 4.3 కోట్ల చొప్పున అందజేస్తామని ఇటీవల ప్రకటించింది. కానీ.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనే సందిగ్ధత నెలకొంది.