ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అందనున్నాయి. ఇప్పటి వరకు మిషన్ భగీరథ పనులు 90 శాతం పూర్తయినట్లు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వెల్లడించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట, ఆదిలాబాద్ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. మార్చి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరగాలని అధికారులకు సీఎస్ ఆదేశాలిచ్చారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మిగిలిన మిషన్ భగీరథ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం 4,744 గ్రామాలకు మంచి నీటి సరఫరా జరుగోతందని అధికారులు సీఎస్‌కు వివరించారు. 2,593 గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయని తెలిపారు.